సింఫెరొపోల్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్ లోని స్వయంప్రతిపత్తిగల ప్రాంతమైన క్రిమియా కుంపటి రాజుకుంటోంది. క్రిమియాను రష్యాలో చేర్చుకోవడానికి రెఫరెండ ఏర్పాటు చేయడాన్నిఅమెరికా తప్పుబట్టింది. బలవంతంగా విలీనం చేసుకోవడాన్ని అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదని అభిప్రాయపడింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ తో ఫోన్ లో సంభాషణలు జరిపారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్వయం ప్రతిపత్తిగల క్రిమియాను రష్యాలో చేర్చుకోవాలా లేక మరిన్ని అధికారాలతో ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా అనే అంశంపై ఆదివారం రిఫరెండం నిర్వహించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రష్యా జెండాలు రెపరెపలాడగా మరికొన్ని చోట్ల రష్యా అనుకూల మిలిషియా సభ్యులు గస్తీ నిర్వహిస్తూ కనిపించారు. ఈ ఘటనపై అమెరికా కన్నేర్నజేసింది. ఈ తరహా చర్యలను అంతర్జాతీయ సమాజం ఎప్పటికీ గుర్తించదని ఒబామా తెలిపారు. ఇందులో భాగంగానే రష్యా దేశంపై ఆంక్షలు విధించేందుకు ఈయూ, అమెరికాలో సిద్ధమవుతున్నాయి. కాగా ఇటువంటి బెదిరింపులను ఖాతరు చేయబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.
నిన్న జరిగిన రెఫరెండ ఎన్నికల్లో రష్యా అనుకూల క్రిమియా ప్రధాని సెర్గీ అక్స్యొనోవ్ క్రిమియా రాజధాని సింఫెరొపోల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే క్రిమియాలో ఎక్కువ మంది రష్యాలో చేరేందుకే మొగ్గుచూపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ రిఫరెండం ఫలితాన్ని తాము గుర్తించబోమని ఉక్రెయిన్ నూతన ప్రభుత్వం తేల్చి చెప్పింది.