ప్రతి ముగ్గురిలో ఒకరిపై కేసు!
యూపీ ఎన్నికల బరిలో అభ్యర్థుల జాతకమిది
► 30% మంది కోటీశ్వరులు
► 41% అభ్యర్థులు పన్నెండో తరగతి లోపువారే!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాతకాలు విస్తు గొలుపుతున్నాయి. బరిలో నిలిచిన ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయి. వాటిల్లో హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నవారూ అధికంగానే ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 30 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇక డిగ్రీ కూడా పూర్తి కాని వారి శాతం 41. నిరక్షరాస్యులు 54 శాతం.
ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. ఏడు దశల ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఈ నెల 8న జరగనుంది. బరిలో ఉన్న మొత్తం 4,823 (మహిళలు 445) అభ్యర్థుల్లో 859 మంది తమపై క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరో 704 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి.
31 మంది అభ్యర్థుల అఫిడవిట్‌లు స్పష్టంగా లేకపోవడంతో వారి వివరాలు ఇక్కడ ఇవ్వలేదని ఏడీఆర్ తెలిపింది. 38 మంది లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్నారు. 1457 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.1.91 కోట్లు. రూ.5 కోట్ల పైనున్నవారు 453 మంది. 13 మంది జీరో ఆస్తులు ప్రకటించడం గమనార్హం. 411 మంది రూ.లక్ష కంటే తక్కువని పేర్కొన్నారు. 1210 మంది పాన్ కార్డు, 2,790 మంది ఆదాయ పన్ను వివరాలు సమర్పించలేదు.