భోపాల్ : సాధారణంగా నచ్చని వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటే ఆ విషయాన్ని పాము పగతో పోలుస్తారు కొంతమంది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన శివ కేవత్ అనే దినసరి కూలీపై పగబట్టిన కాకుల గురించి తెలిస్తే తమ అభిప్రాయం మార్చుకుంటారు. పిల్ల కాకిని చంపేశాడన్న కోపంతో కాకి సమాజం అతడిపై కక్ష గట్టి మూడేళ్లుగా దాడి చేస్తోంది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమని ముఖం నిండా గాయాలతో సతమవుతున్న శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన శివ కేవత్ మూడేళ్ల క్రితం పనికి వెళ్లేందుకు ఇంటి బయటకు వచ్చాడు. ఇంటి సమీపంలో ఉన్న కాకి గూట్లో పిల్ల కాకి మూలుగు విని దాని దగ్గరకు వెళ్లాడు. గాయంతో విలవిల్లాడుతున్న కాకి పిల్లను చేతిలోకి తీసుకుని నిమురుతుండగానే అది ప్రాణాలు కోల్పోయింది. సరిగ్గా అప్పుడే గూటికి దగ్గరకు వచ్చిన తల్లి కాకి సహా ఇతర కాకులు పిల్ల కాకిని శివ చంపేశాడని భావించాయి. ఇక ఆనాటి నుంచి అతడిపై పగబట్టాయి. ఇంట్లో నుంచి శివ బయటికి వెళ్లే సమయంలో అక్కడికి చేరుకుని రోజూ అతడిని ముక్కుతో పొడవడంతో పాటుగా కాళ్లతో ముఖం, చేతులపై దాడి చేయడం ప్రారంభించాయి.
కాగా మొదట్లో ఇదంతా యాధృచ్చికంగా జరుగుతోందని భావించిన శివకు రాను రాను అసలు విషయం అర్థమైంది. దీంతో వాటిని తప్పించుకుని పోయేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కాకులు మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు. మూడేళ్లుగా తాను అనుభవిస్తున్న బాధ గురించి శివ మాట్లాడుతూ..‘ నేను కాకి పిల్లను కాపాడాలనుకున్నాను. కానీ అది నా చేతుల్లో ప్రాణాలు విడిచింది. దీంతో నేనే దాన్ని చంపానని కాకులు భావిస్తున్నాయి. వాటి ఙ్ఞాపక శక్తి అమోఘం. ఇన్నేళ్లు అయినా నా ముఖాన్ని మర్చిపోకుండా దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా నన్ను క్షమించి వదిలేస్తే బాగుండు’ అని వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment