ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం మావోయిస్టులు మందుపాతర పేల్చి ఏడుగురు జవాన్లను హతమార్చిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. సీఆర్పిఎఫ్ జవాన్ల కదలికలకు సంబంధించిన సమాచారం మావోయిస్టులకు లీక్ అయి ఉంటుందని సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్లకు డీజీ గురువారం నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో 50 కేజీల పేలుడు పదార్థాలను మావోయిస్టులు ఉపయోగించారని తెలిపారు. భవిష్యత్తులో మావోయిస్టులు సొరంగాల ద్వారా రద్దీగా ఉన్న రోడ్లలో పేలుడు పదార్థాలను అమర్చడానికి పథకరచన చేయనున్నారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.
సీఆర్‌పీఎఫ్‌కు సంబంధించిన కీలకవ్యూహం మావోయిస్టులకు చేరడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏడుగురు జవాన్ల కదలికల సమాచారాన్ని కచ్చితంగా ఎవరో వారికి అందించి ఉంటారన్నారు. సంఘటన జరిగిన తీరు సమాచారం అందించి ఉంటారనే అనుమానాలను బలపరుస్తోందన్నారు. 50 మందుపాతరలను అమర్చడానికి సొరంగాన్ని తవ్వి, దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. సొరంగాల ద్వారా దాడికి పాల్పడుతున్న విషయం నిజమైతే, మావోయిస్టులు కొత్త పద్ధతిలో దాడులు చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్న శక్తిమంతమైన దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఇది మావోయిస్టులు భారీ వ్యూహంతో చేసిన దాడి అని పేర్కొన్నారు. దీనిపై పూర్తివిచారణ జరుగుతుందని తెలిపారు.
గత కొన్నినెలల క్రితం తమ బృందం 9 అడుగుల సొరంగాన్ని బీజాపూర్ జిల్లాలో కనుగొందని చెప్పారు. దంతేవాడ రేంజ్ సీఆర్ పీఎఫ్ డీఐజీ దినేష్ ప్రతాప్ ఉపాధ్యాయ మాట్లాడుతూ సీఆర్‌పీఎఫ్ జవాన్లు సాధారణ దుస్తుల్లో ఉన్నపుడు దాడి జరిగిందని గుర్తుచేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించారు.
వరుస ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల ప్రతీకారదాడులతో ఛత్తీస్‌గఢ్ అట్టుడుకుతోంది. పోలీసు ఎన్‌కౌంటర్లలో రెండురోజుల క్రితమే ముగ్గురు.. గతనెల ప్రారంభంలో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా మావోయిస్టులు బుధవారం చెలరేగిపోయారు. దంతేవాడలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేశారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు మూడు వాహనాల్లో దంతెవాడకు వస్తుండగా మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. మందుపాతర పేలుడు తీవ్రతకు ఘటనాస్థలంలో 15 అడుగుల గొయ్యి పడగా జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలైపోయింది. దీంతో ఏడుగురు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.
మా గురించి మావోయిస్టులకు ఉప్పందింది
Published Fri, Apr 1 2016 12:56 PM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM
Advertisement
Advertisement