ఆ శునకం చూడకపోతే.. ఎన్ని ప్రాణాలు పోయేవో!
ఆ శునకం చూడకపోతే.. ఎన్ని ప్రాణాలు పోయేవో!
Published Fri, Nov 4 2016 8:29 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
పోలీసు కుక్కలు అంటే వాసన చూసి దేన్నైనా పసిగడతాయి. సీఆర్పీఎఫ్‌లో కూడా ఇలాగే శిక్షణ పొందిన శునకాలు ఉన్నాయి. సరిగ్గా అలాంటిదే ఓ వీర శునకం.. మావోయిస్టులు అమర్చిన అత్యంత శక్తిమంతమైన ఐఈడీని గుర్తించి.. పలు ప్రాణాలను కాపాడింది. ఒడిసాలోని రాయగడ జిల్లాలోని హతమునిగూడ వద్ద మావోయిస్టులు ఐదు కిలోల ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)ను అమర్చారు. దాన్ని ఆక్సెల్ అనే సీఆర్పీఎఫ్ శునకం గుర్తించింది. అయితే, దాన్ని గుర్తించే సమయంలో దాని కాలికి, కంటి కింద తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత బాంబు నిర్వీర్య దళం వచ్చి... ఆ బాంబును డిఫ్యూజ్ చేసింది.
ఈ ఐఈడీని గనక మావోయిస్టులు పేల్చి ఉంటే.. అటువైపుగా కూంబింగ్ కోసం వెళ్లే సీఆర్పీఎఫ్ బలగాలకు చాలా పెద్దమొత్తంలోనే ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు. ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత కలహండి, కొంధమాల్, రాయగడ జిల్లాల్లో సీఆర్పీఎఫ్, ఒడిషా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకోడానికి మావోయిస్టులు ఈ ఐఈడీని అమర్చి ఉంటారని సీఆర్పీఎఫ్ అధికారులు భావిస్తున్నారు. ఏడేళ్ల వయసున్న ఆక్సెల్.. గత నాలుగేళ్ల నుంచి సీఆర్పీఎఫ్‌కు సేవలు అందిస్తోంది. శంభు ప్రసాద్ అనే ట్రైనర్ దాని బాధ్యతలు చూస్తున్నారు.
Advertisement