ఆ ప్రధాని పేరు.. మెక్ కల్లమ్ అట!
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత దేశంలో పర్యటిస్తోంది. టీమిండియాతో టెస్టు సిరీస్ ముగించుకుని వన్డే సిరీస్ ఆడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అదే దేశ ప్రధానమంత్రి జాన్ కీ కూడా మన దేశంలో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య పర్యాటక సంబంధాల గురించి ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమావేశంలో మన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ కూడా పాల్గొన్నారు. ఈయన క్రికెట్ మ్యాచ్‌లు మరీ ఎక్కువగా చూస్తున్నారో ఏమో గానీ, ఆ దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి మాట్లాడబోయి.. ''హిజ్ ఎక్సలెన్సీ ప్రైమ్ మినిస్టర్ మెక్ కల్లమ్' అని సంబోధించారు. అది కూడా ఒకసారి కాదు.. రెండుసార్లు అలా అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దాని గురించి మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు.
న్యూజిలాండ్‌కు పర్యాటక రాయబారి అయిన బాలీవుడ్ స్టార్ సిద్దార్థ మల్హోత్రా మంత్రిగారి చెవిలో ఈ విషయాన్ని ఊదాడు. అయితే న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ మాత్రం ఈ విషయాన్ని పెద్దంత సీరియస్‌గా పట్టించుకోలేదు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య డైరెక్ట్ విమానం నడిపిస్తే రెండు దేశాల పర్యాటకులకు బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సదస్సుకు వచ్చినవారికి అచ్చమైన భారతీయ శైలిలో 'నమస్తే.. సత్ శ్రీ అకాల్' అంటూ ఆయన వందనాలు పలికారు. సిద్దార్థ మల్హోత్రా లాంటి యువ నటులు తమ దేశ పర్యాటక రాయబారి కావడం పట్ల సంతోషం ప్రకటించారు. భారత దేశం నుంచి ప్రతియేటా 43 వేల మంది న్యూజిలాండ్ సందర్శనకు వస్తున్నారని చెబుతూ, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.