McCullum
-
మెకల్లమ్‌లాంటి ఇన్నింగ్స్‌తో మొదలవ్వాలి
కొత్త ఐపీఎల్ మరెంతో ఉత్సాహాన్నిచ్చేందుకు ముస్తాబైంది. ఇక్కడ క్రికెటర్లకిచ్చే పారితోషికమే కాదు... నాణ్యమైన క్రికెట్ కూడా యేటికేడు పెరుగుతూ వస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి ప్రేక్షకుల మద్దతు మరింత శోభను తెచ్చింది. గ్లామర్ సొగసుతో సమ్మోహపరుస్తున్న ఇలాంటి క్రికెట్ లీగ్ ప్రపంచంలోనే మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో లీగ్‌లో భాగమయ్యేందుకు చాలామంది తహతహలాడుతున్నారు. పదేళ్ల చరిత్రకు మొదట బ్రెండన్ మెకల్లమ్ నాంది పలికిన తీరు అద్భుతం. ఐపీఎల్–1లో కోల్‌కతాకు ఆడిన కివీస్ సూపర్‌స్టార్ (73 బంతుల్లో 158 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్స్‌లు) లీగ్ భవితవ్యాన్ని చెప్పకనే చెప్పాడు. అలాంటిదే ఈ 11వ సీజన్లోనూ రావాలని ఆశిస్తున్నా. వాంఖెడే స్టేడియం అందుకు వేదికవ్వాలని కోరుకుంటున్నా. లీగ్‌లోకి తిరిగొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌పై అందరి కళ్లు పడ్డాయి. ధోని చరిష్మాతో మళ్లీ చెన్నై చెలరేగుతుంది. ఇటీ వలే ఆర్మీ డ్రెస్‌తో కవాతు చేస్తూ ‘పద్మ భూషణ్’ అందుకున్న ధోని ఈ సీజన్లో తన దళాన్ని అలాగే నడిపిస్తాడేమో! వెటరన్ స్పిన్నర్ హర్భజన్, రవీంద్ర జడేజాల స్పిన్, ధోని నేతృత్వంలోని బ్యాటింగ్ బలగం అతనికి మరో ఐపీఎల్ ట్రోఫీని ఇస్తుందేమో చూడాలి. అయితే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తక్కువేం కాదు. ట్రోఫీ కోసం రోహిత్ సేన ఎందాకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రేక్షకులంతా రసవత్తర లీగ్‌ను మే 27 దాకా ఆస్వాదించేందుకు రెడీగా ఉండాల్సిందే. -
18 సిక్సర్లతో గేల్ విధ్వంసం.!
ఢాకా : టీ20 క్రికెట్లో విధ్వంస బ్యాటింగ్‌తో చెలరేగే ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో తన రికార్డు తనే అధిగమించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున పుణే వారియర్స్‌పై గేల్ బాదిన 17 సిక్సర్లే అత్యధిక సిక్సర్ల రికార్డుగా ఉంది. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ ఫైనల్లో రంగపూర్ రైడర్స్ జట్టు తరుపున ఢాకా డైనమైట్స్పై 18 సిక్సులు బాది పాత రికార్డును అధిగమించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో గేల్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రంగపూర్ రైడర్స్ ఐదు పరుగలకే తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్‌గా ఉన్న గేల్ కీవీస్ బ్యాట్స్‌మన్ మెకల్లమ్‌తో కలిపి మైదానంలో పరుగుల తుఫాన్‌ను సృష్టించాడు. ఇక రెండో వికెట్‌కు ఈ జోడి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది బీపీఎల్ చరిత్రలోనే తొలి అత్యధిక భాగస్వామ్యం. 69 బంతులు ఆడిన గేల్ 18 సిక్సర్లు, 5 ఫోర్లతో 146 పరుగుల చేసి బీపీఎల్ చరిత్రలో రికార్డు సెంచరీ నమోదు చేశాడు. మెకల్లమ్ 43 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సులతో 51 పరుగులు చేశాడు. దీంతో ఢాకా డైనమెట్స్కు రంగపూర్ రైడర్స్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి క్రికెట్లో ఓవరాల్‌గా గేల్‌కు ఇది 20వ సెంచరీ కాగా.. బీపీఎల్‌లో రెండోది. ఇక ఈ సెంచరీతో ఓవరాల్ టీ20ల్లో గేల్ 11 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. -
ఆ ప్రధాని పేరు.. మెక్ కల్లమ్ అట!
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత దేశంలో పర్యటిస్తోంది. టీమిండియాతో టెస్టు సిరీస్ ముగించుకుని వన్డే సిరీస్ ఆడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అదే దేశ ప్రధానమంత్రి జాన్ కీ కూడా మన దేశంలో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య పర్యాటక సంబంధాల గురించి ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమావేశంలో మన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ కూడా పాల్గొన్నారు. ఈయన క్రికెట్ మ్యాచ్‌లు మరీ ఎక్కువగా చూస్తున్నారో ఏమో గానీ, ఆ దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి మాట్లాడబోయి.. ''హిజ్ ఎక్సలెన్సీ ప్రైమ్ మినిస్టర్ మెక్ కల్లమ్' అని సంబోధించారు. అది కూడా ఒకసారి కాదు.. రెండుసార్లు అలా అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దాని గురించి మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు. న్యూజిలాండ్‌కు పర్యాటక రాయబారి అయిన బాలీవుడ్ స్టార్ సిద్దార్థ మల్హోత్రా మంత్రిగారి చెవిలో ఈ విషయాన్ని ఊదాడు. అయితే న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ మాత్రం ఈ విషయాన్ని పెద్దంత సీరియస్‌గా పట్టించుకోలేదు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య డైరెక్ట్ విమానం నడిపిస్తే రెండు దేశాల పర్యాటకులకు బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సదస్సుకు వచ్చినవారికి అచ్చమైన భారతీయ శైలిలో 'నమస్తే.. సత్ శ్రీ అకాల్' అంటూ ఆయన వందనాలు పలికారు. సిద్దార్థ మల్హోత్రా లాంటి యువ నటులు తమ దేశ పర్యాటక రాయబారి కావడం పట్ల సంతోషం ప్రకటించారు. భారత దేశం నుంచి ప్రతియేటా 43 వేల మంది న్యూజిలాండ్ సందర్శనకు వస్తున్నారని చెబుతూ, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆ రచ్చను మరచిపోలేను: మెకల్లమ్
వెల్లింగ్టన్:గతంలో తన సహచర ఆటగాడు క్రిస్ కెయిన్స్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ రచ్చను ఎప్పటికీ మరచిపోలేనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేర్కొన్నాడు. అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన అనంతరం తనపై కూడా బురదజల్లే ప్రయత్నం జరిగిందని మెకల్లమ్ అన్నాడు. తన ప్రతిష్టకు భంగం కలగడానికి అతను ప్రవర్తించిన తీరే కారణమన్నాడు. ఆ ఘటనను తాను ఎప్పటికీ మరచిపోలేనన్నాడు. ' కెయిన్స్ కేసులో నేను కూడా సాక్షం ఇచ్చాను. నన్ను కూడా కొంతమంది బుకీలు కలిశారంటూ అప్పుడు ఆరోపణలు వచ్చాయి. దానికి కెయిన్స్ ప్రధాన కారణం. నాకు క్షమాగుణం ఎక్కువ. నా జీవితంలో చాలా వివాదాలు చూసినా వాటిని ఏటినీ మనసులో పెట్టుకోలేదు. అయితే ఆనాటి ఫిక్సింగ్ ఆరోపణల ఘటన మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. నేను ఎప్పుడూ ఫిక్సింగ్ అనే చాపలో ఇరుక్కోవాలని అనుకోలేదు' అని మెకల్లమ్ పేర్కొన్నాడు. 2008లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే గతేడాది అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ లండన్‌లోని సైత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు కోర్టులు చుట్టూ తిరిగిన అతను ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ సమయంలో మెకల్లమ్, రికీ పాంటింగ్‌లు కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. -
'ఆ క్రికెటర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం'
వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్రవేసిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రిటైర్మెంట్ నిజంగా పూడ్చలేనిదని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. ఆ తరహా ఆటగాడ్ని వెతికిపట్టుకోవడం న్యూజిలాండ్‌కు కష్టసాధ్యమన్నాడు. అటు బ్యాట్స్ మెన్‌గానే కాదు, ఇటు అనుభవంలోనూ మెకల్లమ్ స్థానాన్ని భర్తీ చేయడం న్యూజిలాండ్ కచ్చితంగా సవాలేనని వార్నర్ పేర్కొన్నాడు. గతంలో కివీస్ జట్టులో కీలక పాత్ర పోషించిన స్టెఫెన్ ఫ్లెమింగ్, డానియల్ వెటోరీలు వీడ్కోలు తీసుకున్నప్పుడు కూడా ఆ లోటును తిరిగి పూడ్చడం వారికి సాధ్యం కాలేదన్నాడు. ఆయా ఆటగాళ్లు వారి బ్యాటింగ్ తో పాటు, వారు నాయకత్వంలోనూ తమదైన మార్కును సృష్టించారన్నాడు. ఇదే తరహాలో మెకల్లమ్ కెప్టెన్ గా ఉన్నప్పట్నుంచి జట్టును ముందుండి నడిపించిన తీరు అభినందనీయమన్నాడు. ఇలా బహుముఖ పాత్రల్లో మెరిసిన మెకల్లమ్ లోటును పూడ్చడం వారికి కష్టమన్నాడు. ఆటలో వివాదాలకు దూరంగా ఉండే మెకల్లమ్ ఒక గ్రేట్ జెంటిల్మెన్ గా వార్నర్ అభివర్ణించాడు. ఇటీవల వన్డేల నుంచి తప్పుకున్న మెకల్లమ్.. ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్ అనంతరం మెకల్లమ్ వీడ్కోలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
'మరో ఏడాది పాటు కెప్టెన్ గా ఉంటా'
క్రిస్ట్ చర్చ్: న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలకు బ్రెండన్ మెకల్లమ్ ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఒక సంవత్సరం పాటు కెప్టెన్ గా కొనసాగే ఒప్పంద పత్రాల మీద తాను తాజాగా సంతకం చేసినట్లు మెకల్లమ్ స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ లో అమోఘంగా రాణించిన కివీస్..ఆ తరువాత ఇంగ్లండ్ తో జరిగిన వన్డే, ట్వంటీ 20 సిరీస్ లలో ఘోరంగా విఫలమైంది. దీంతో కెప్టెన్సీ నుంచి మెకల్లమ్ వైదొలిగే సమయం ఆసన్నమైందంటూ వార్తలు చుట్టుముట్టాయి. దీనిపై శుక్రవారం వివరణ ఇచ్చిన మెకల్లమ్.. మరో సంవత్సరం పాటు జట్టుకు నేతృత్వం వహించనున్నట్లు తెలిపాడు. ఈ సంవత్సరం న్యూజిలాండ్ అద్వితీయమైన ఆటతీరును కనబరిచినా ఇంగ్లండ్ పై ఓటమి మాత్రం బాధించిదన్నాడు. గత 18 నెలలుగా తమ జట్టు అంచనాల మించి రాణించినా.. వచ్చే 12 నెలల మాత్రం క్లిష్టంగా ఉండే అవకాశాలు లేకపోలేదన్నాడు. 2015-16 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో సిరీస్ తో పాటు భారత్ లో జరిగే ప్రధానమైన ట్వంటీ 20 టోర్నమెంట్ లు తమకు అత్యంత కీలకమన్నాడు. -
మెకల్లమ్ ఫిక్సర్ కాదు
న్యూజిలాండ్ క్రికెట్ స్పష్టీకరణ వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై కివీస్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్‌పై ఐసీసీ విచారణ జరుగుతుందనే కథనాలను న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) బోర్డు ఖండించింది. 2008లో మెకల్లమ్‌ను ఓ ఫిక్సర్ సంప్రదించినప్పటికీ ఆ ఆఫర్‌ను అతను తిరస్కరించాడని తెలిపింది. ఈ వ్యవహారంపై బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్లో కథనం ప్రచురితమైంది. ‘మెకల్లమ్ ఐసీసీ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని అవినీతి వ్యతిరేక యూనిట్ బ్రిటిష్ మీడియాకు లీక్ చేయడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఐసీసీ పరిశోధన కింద మాత్రం మెకల్లమ్ లేడని స్పష్టం చేస్తున్నాం. నిజానికి తన నిజాయితీని వారు అప్పుడే ప్రశంసించారు. అవినీతిని ఎదుర్కోవడంలో మా కెప్టెన్‌పై వంద శాతం నమ్మకముంది’ అని ఎన్‌జడ్‌సీ తమ ప్రకటనలో వెల్లడించింది. ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభానికి ముందు 2008లో ప్రపంచ ప్రఖ్యాత మాజీ క్రికెటర్ ఒకరు మెకల్లమ్‌తో మ్యాచ్ ఫిక్స్ చేయించేందుకు ప్రయత్నించాడని డెయిలీ మెయిల్ పేర్కొంది. ఆ తర్వాత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా మాజీ క్రికెటర్ కలిశాడని చెప్పింది. పేలవంగా ఆడితే లక్షా 80 వేల డాలర్లు ఇస్తానని, అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద ఆటగాళ్లంతా ఫిక్సింగ్ చేస్తున్నారని ఆ ఆటగాడు మెకల్లమ్‌తో చెప్పినట్లు ఆ పత్రిక కథనంలో పేర్కొంది.