మెకల్లమ్ ఫిక్సర్ కాదు
న్యూజిలాండ్ క్రికెట్ స్పష్టీకరణ
వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై కివీస్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్‌పై ఐసీసీ విచారణ జరుగుతుందనే కథనాలను న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) బోర్డు ఖండించింది. 2008లో మెకల్లమ్‌ను ఓ ఫిక్సర్ సంప్రదించినప్పటికీ ఆ ఆఫర్‌ను అతను తిరస్కరించాడని తెలిపింది. ఈ వ్యవహారంపై బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్‌లో కథనం ప్రచురితమైంది. ‘మెకల్లమ్ ఐసీసీ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని అవినీతి వ్యతిరేక యూనిట్ బ్రిటిష్ మీడియాకు లీక్ చేయడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఐసీసీ పరిశోధన కింద మాత్రం మెకల్లమ్ లేడని స్పష్టం చేస్తున్నాం.
నిజానికి తన నిజాయితీని వారు అప్పుడే ప్రశంసించారు. అవినీతిని ఎదుర్కోవడంలో మా కెప్టెన్‌పై వంద శాతం నమ్మకముంది’ అని ఎన్‌జడ్‌సీ తమ ప్రకటనలో వెల్లడించింది. ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభానికి ముందు 2008లో ప్రపంచ ప్రఖ్యాత మాజీ క్రికెటర్ ఒకరు మెకల్లమ్‌తో మ్యాచ్ ఫిక్స్ చేయించేందుకు ప్రయత్నించాడని డెయిలీ మెయిల్ పేర్కొంది.
ఆ తర్వాత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా మాజీ క్రికెటర్ కలిశాడని చెప్పింది. పేలవంగా ఆడితే లక్షా 80 వేల డాలర్లు ఇస్తానని, అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్ద ఆటగాళ్లంతా ఫిక్సింగ్ చేస్తున్నారని ఆ ఆటగాడు మెకల్లమ్‌తో చెప్పినట్లు ఆ పత్రిక కథనంలో పేర్కొంది.