ఆ రచ్చను మరచిపోలేను: మెకల్లమ్
వెల్లింగ్టన్:గతంలో తన సహచర ఆటగాడు క్రిస్ కెయిన్స్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ రచ్చను ఎప్పటికీ మరచిపోలేనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేర్కొన్నాడు. అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన అనంతరం తనపై కూడా బురదజల్లే ప్రయత్నం జరిగిందని మెకల్లమ్ అన్నాడు. తన ప్రతిష్టకు భంగం కలగడానికి అతను ప్రవర్తించిన తీరే కారణమన్నాడు. ఆ ఘటనను తాను ఎప్పటికీ మరచిపోలేనన్నాడు.
' కెయిన్స్ కేసులో నేను కూడా సాక్షం ఇచ్చాను. నన్ను కూడా కొంతమంది బుకీలు కలిశారంటూ అప్పుడు ఆరోపణలు వచ్చాయి. దానికి కెయిన్స్ ప్రధాన కారణం. నాకు క్షమాగుణం ఎక్కువ. నా జీవితంలో చాలా వివాదాలు చూసినా వాటిని ఏటినీ మనసులో పెట్టుకోలేదు. అయితే ఆనాటి ఫిక్సింగ్ ఆరోపణల ఘటన మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. నేను ఎప్పుడూ ఫిక్సింగ్ అనే చాపలో ఇరుక్కోవాలని అనుకోలేదు' అని మెకల్లమ్ పేర్కొన్నాడు. 2008లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే గతేడాది అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ లండన్‌లోని సైత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు కోర్టులు చుట్టూ తిరిగిన అతను ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ సమయంలో మెకల్లమ్, రికీ పాంటింగ్లు కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది.