బ్రెండన్ మెకల్లమ్ (ఫైల్ ఫొటో)
కొత్త ఐపీఎల్ మరెంతో ఉత్సాహాన్నిచ్చేందుకు ముస్తాబైంది. ఇక్కడ క్రికెటర్లకిచ్చే పారితోషికమే కాదు... నాణ్యమైన క్రికెట్ కూడా యేటికేడు పెరుగుతూ వస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి ప్రేక్షకుల మద్దతు మరింత శోభను తెచ్చింది. గ్లామర్ సొగసుతో సమ్మోహపరుస్తున్న ఇలాంటి క్రికెట్ లీగ్ ప్రపంచంలోనే మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో లీగ్‌లో భాగమయ్యేందుకు చాలామంది తహతహలాడుతున్నారు. పదేళ్ల చరిత్రకు మొదట బ్రెండన్ మెకల్లమ్ నాంది పలికిన తీరు అద్భుతం. ఐపీఎల్–1లో కోల్‌కతాకు ఆడిన కివీస్ సూపర్‌స్టార్ (73 బంతుల్లో 158 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్స్‌లు) లీగ్ భవితవ్యాన్ని చెప్పకనే చెప్పాడు. అలాంటిదే ఈ 11వ సీజన్‌లోనూ రావాలని ఆశిస్తున్నా.
వాంఖెడే స్టేడియం అందుకు వేదికవ్వాలని కోరుకుంటున్నా. లీగ్‌లోకి తిరిగొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌పై అందరి కళ్లు పడ్డాయి. ధోని చరిష్మాతో మళ్లీ చెన్నై చెలరేగుతుంది. ఇటీ వలే ఆర్మీ డ్రెస్‌తో కవాతు చేస్తూ ‘పద్మ భూషణ్’ అందుకున్న ధోని ఈ సీజన్‌లో తన దళాన్ని అలాగే నడిపిస్తాడేమో! వెటరన్ స్పిన్నర్ హర్భజన్, రవీంద్ర జడేజాల స్పిన్, ధోని నేతృత్వంలోని బ్యాటింగ్ బలగం అతనికి మరో ఐపీఎల్ ట్రోఫీని ఇస్తుందేమో చూడాలి. అయితే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తక్కువేం కాదు. ట్రోఫీ కోసం రోహిత్ సేన ఎందాకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రేక్షకులంతా రసవత్తర లీగ్‌ను మే 27 దాకా ఆస్వాదించేందుకు రెడీగా ఉండాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment