అతడు ఏబీని తలపించాడు  | sunil gavaskar match analysisS | Sakshi
Sakshi News home page

అతడు ఏబీని తలపించాడు 

Published Sun, May 27 2018 1:36 AM | Last Updated on Sun, May 27 2018 1:36 AM

sunil gavaskar match analysisS - Sakshi

ఈ సీజన్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే మళ్లీ ఫైనల్లో ఆడేందుకు సిద్ధమయ్యాయి. టోర్నీలో మిగతా జట్లకంటే మేటి జట్లే టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి. ఐపీఎల్‌ చరిత్రలో సాధారణంగా రెండో స్థానంలో నిలిచిన జట్లే ఎక్కువ సార్లు టైటిల్స్‌ గెలిచాయి. ఇది చెన్నై సూపర్‌ కింగ్స్‌కు శుభసూచకం. దీంతో చెన్నై అభిమానులు మరోసారి మన జట్టే టైటిల్‌ గెలుస్తుందనే ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు. పునరాగమనాన్ని టైటిల్‌తో ఘనంగా చాటుతుందనే అంచనాలు సూపర్‌ కింగ్స్‌ అభిమానుల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గెలిచి నేరుగా ఫైనల్‌ చేరిన చెన్నై ఒక దశలో ఓటమికి దగ్గరైంది. డు ప్లెసిస్‌ అద్వితీయ పోరాటంతో చివరకు గెలిచింది. అయితే ఫైనల్లో ఫామ్‌లో ఉన్న రాయుడిని కాదని డు ప్లెసిస్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుందని నేననుకోను. ఇది అంత తెలివైన పని కాదు. బౌండరీలు, సిక్సర్లు బాదే అతన్ని మిడిలార్డర్‌లోనే కొనసాగించాలి. ఛేదనలో చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌కు తిరుగులేదనే చెప్పాలి.

ఎలాంటి ప్రత్యర్థి ఎదురైనా... ఎంతటి పెద్ద స్కోరున్నా... చెన్నై బ్యాట్స్‌మెన్‌ ఛేదించగలరు. ఇలాంటి జట్టుకు స్వల్ప స్కోరు చేసినా... నిలబెట్టుకునే సన్‌రైజర్స్‌ ఎదురైంది. హైదరాబాద్‌ బ్యాటింగ్‌ లైనప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోలిస్తే అంత పటిష్టమైందేమీ కాదు. ఓపెనర్‌ ధావన్, కెప్టెన్‌ విలియమ్సన్‌లపైనే సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ఆధార పడి ఉంది. మిగతా వారున్నప్పటికీ వాళ్లెవరూ వీళ్లిద్దరిలా నిలకడగా ఆడలేరు. పరిస్థితులకు తగ్గట్లు ఆదుకోలేరు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన కీలకపోరులో ‘వన్‌ మన్‌ ఆర్మీ షో’తో హైదరాబాద్‌ గెలవగలిగింది. ఒకే ఒక్కడు రషీద్‌ ఖాన్‌ మొదట బ్యాటింగ్‌లో, తర్వాత బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ ఆశలను నిలబెట్టాడు. ముఖ్యంగా అతను డివిలియర్స్‌ ఆడే ఫ్లిక్‌ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతని బ్యాటింగ్‌లో ఈ షాట్లే అత్యుత్తమం. ఇక బౌలింగ్‌లోనూ తన మాయాజాలంతో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చాడు. ఇది సరిపోదన్నట్లు అద్భుతమైన రనౌట్, రెండు క్యాచ్‌లతో రషీద్‌ మెరిశాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన నితీశ్‌ రాణాను బుల్లెట్‌ వేగంతో విసిరిన త్రోతో రనౌట్‌ చేశాడు. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్‌ను ఫైనల్లోకి తెచ్చిందే రషీద్‌ ఖాన్‌. మైదానంలో అతని సత్తా, సామర్థ్యం అమోఘం. ఇదే రీతిలో ఫైనల్లోనూ చెలరేగితే సన్‌రైజర్స్‌ కొత్త చరిత్ర లిఖించడం ఖాయం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement