
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ముందు రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ తేలిపోయింది. చెన్నై సూపర్‌కింగ్స్‌లా ఆ జట్టుకు పునరాగమన మ్యాచ్ గొప్పగా సాగలేదు. సన్‌రైజర్స్ బౌలింగ్ బలగాన్ని కెప్టెన్ విలియమ్సన్ చక్కగా నడిపించాడు. ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా కదిలిన అతడు... బ్యాటింగ్‌లో ధావన్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. శామ్సన్ బాగా ఆడినా రాజస్తాన్ కుర్రాళ్లు దానిని అనుసరించలేకపోయారు. సంజుకు ఇతరుల మద్దతు లేకపోవడంతో 52/1 వంటి స్థితిని జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. రాయల్స్‌కు సోమవారం రాత్రి కలిసిరాలేదు. మంచి క్యాచర్ అయిన రహానే... ఖాతా తెరవక ముందే ధావన్ నేరుగా ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. పుండు మీద కారంలా తర్వాత ధావన్ చెలరేగి ఆడి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
రాజస్తాన్ ఆటగాళ్లు ఈ ఓటమి నుంచి త్వరగా బయటపడాలి. వారి కీలక ఆటగాడైన బెన్ స్టోక్స్‌కు ఫలితాన్ని మార్చేసే సత్తా ఉంది. తను చెలరేగితే ఢిల్లీ మ్యాచ్‌ను గెలిచేందుకు అతడికి దీటైన డేర్ డెవిల్‌ను వెదుక్కోవాల్సి ఉంటుంది. ఢిల్లీ బౌలర్లు బంతులను కచ్చితమైన లైన్‌లో వేయాలి. పంజాబ్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విధ్వంసక, కరుణ్ నాయర్ సమయోచిత అర్ధ శతకాలతో డేర్ డెవిల్స్‌కు తిరిగి కోలుకోవడం సాధ్యం కాలేదు. ఇంకా ప్రారంభ దశే కాబట్టి... అన్ని జట్లు తమ ఉత్తమ 11 మంది ఆటగాళ్లెవరో తేల్చుకోవాలి. కొన్ని మ్యాచ్‌లను బట్టి చూస్తే ఆల్ రౌండర్లున్న జట్లదే ఆధిపత్యం కానుందని తెలుస్తోంది.