'మరో ఏడాది పాటు కెప్టెన్ గా ఉంటా'
క్రిస్ట్ చర్చ్: న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలకు బ్రెండన్ మెకల్లమ్ ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఒక సంవత్సరం పాటు కెప్టెన్ గా కొనసాగే ఒప్పంద పత్రాల మీద తాను తాజాగా సంతకం చేసినట్లు మెకల్లమ్ స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ లో అమోఘంగా రాణించిన కివీస్..ఆ తరువాత ఇంగ్లండ్ తో జరిగిన వన్డే, ట్వంటీ 20 సిరీస్ లలో ఘోరంగా విఫలమైంది. దీంతో కెప్టెన్సీ నుంచి మెకల్లమ్ వైదొలిగే సమయం ఆసన్నమైందంటూ వార్తలు చుట్టుముట్టాయి. దీనిపై శుక్రవారం వివరణ ఇచ్చిన మెకల్లమ్.. మరో సంవత్సరం పాటు జట్టుకు నేతృత్వం వహించనున్నట్లు తెలిపాడు.
ఈ సంవత్సరం న్యూజిలాండ్ అద్వితీయమైన ఆటతీరును కనబరిచినా ఇంగ్లండ్ పై ఓటమి మాత్రం బాధించిదన్నాడు. గత 18 నెలలుగా తమ జట్టు అంచనాల మించి రాణించినా.. వచ్చే 12 నెలల మాత్రం క్లిష్టంగా ఉండే అవకాశాలు లేకపోలేదన్నాడు. 2015-16 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో సిరీస్ తో పాటు భారత్ లో జరిగే ప్రధానమైన ట్వంటీ 20 టోర్నమెంట్ లు తమకు అత్యంత కీలకమన్నాడు.