సహారన్పూర్లో ఘర్షణలు.. కర్ఫ్యూ విధింపు
ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. దాంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించినా కూడా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఐదుగురు పోలీసులు సహా 18 మంది గాయపడ్డారు. ఓ పోలీసుకు బుల్లెట్ గాయాలు అయ్యాయని, అతడి పరిస్థితి విషమంగా ఉందని సహారన్పూర్ కమిషనర్ తన్వీర్ జాఫర్ అలీ తెలిపారు.
రెండు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణల కారణంగా పలు దుకాణాలు, వాహనాలు తగలబడిపోయాయి. రెండు వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలపై న్యాయవివాదం ఉండటం, దానిపై వివాదాలు చెలరేగడమే ఈ ఘర్షణలకు కారణమని సహారన్పూర్ డీఐజీ రవీంద్ర తెలిపారు. భూమి చుట్టూ ఓ వర్గానికి చెందినవారు శనివారం నాడు ప్రహరీ నిర్మిస్తుండగా రెండోవర్గం వారు అడ్డుకున్నారు. దీంతో వివాదం చెలరేగి ఇరువర్గాల వారు రాళ్లు విసురకున్నారు. పోలీసులు తొలుత రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. తర్వాత 144 సెక్షన్ విధించారు. చివరకు కర్ఫ్యూ విధించి పీఏసీ, ఆర్ఏఎఫ్ దళాలను మోహరించారు.