శ్రీనగర్ః సుదీర్ఘ కాలం తర్వాత కశ్మీర్ లో వాతావరణం కాస్త చల్ల బడింది. హిజ్బుల్ టెర్రరిస్ట్ బుర్హాన్ వాని మృతి అనంతరం మొదలైన ఆందోళనలతో కల్లోలంగా మారిన కశ్మీర్ లో.. 52 రోజుల తర్వాత కర్ఫ్యూ ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ మాత్రం కొనసాగనుంది.
బుర్హాన్ వని మృతి అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనల కారణంగా సుమారు 70 మంది మృతి చెందారు. 11,000 మంది వరకూ గాయాలపాలయ్యారు. కర్ఫ్యూతో లోయలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఆదివారం మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కశ్మీరీలకు చేరువయ్యేందుకు ఐకమత్యం, ప్రేమలే ప్రధాన మంత్రాలని పేర్కొన్నారు. లోయలో జరుగుతున్న అల్లర్లలో అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, వారంతా మనవారన్న విషయాన్ని మరచిపోవద్దని ఆయన గుర్తు చేశారు. మధ్యవర్తులు, వేర్పాటువాదులతో చర్చించిన అనంతరం మూడు అంశాల ప్రణాళికపై జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ సైతం ప్రధాని సమావేశంలో చర్చించిన విషయం తెలిసిందే. లోయలో రక్తపాతాన్ని ఆపాలని అంతా కోరుకుంటున్నారని, అయితే మాటలకే పరిమితం కాకుండా... హత్యలు ఆపేందుకు, కశ్మీర్ వీధుల్లో శాంతి తిరిగి పొందేందుకు తాను హురియత్ సహాయంకోరినట్లు ముఫ్తీ తెలిపారు.
మరోవైపు కశ్మీర్ సమస్యకు ఓ శాశ్వత పరిష్కారం తెచ్చేందుకు గతవారం రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సైతం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వేర్పాటువాదులతో సహా అందర్నీ భాగస్వాములు చేసి చర్చలు జరపాలని వారంతా ప్రధానికి విన్నవించారు.
52 రోజుల అనంతరం కర్ఫ్యూ ఎత్తివేత..
Published Mon, Aug 29 2016 3:42 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
Advertisement
Advertisement