
పై-లీన్ తుపాను వేగం.. దేశంలో సగం సైజు!
బంగాళాఖాతంలో క్రమంగా బలోపేతం అవుతూ తూర్పు తీరం వైపు వేగంగా కదులుతున్న పై-లీన్ తుపాను ఏకంగా మనదేశం సైజులో సగం వరకూ ఉందట. తీరాన్ని తాకేదాకా పైలీన్ పరిమాణం, బలం తగ్గే అవకాశాలు లేవని హవాయిలో అమెరికా నేవీకి చెందిన ‘జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్(జేటీడబ్ల్యూసీ)’ వెల్లడించింది. పై-లీన్ తీరాన్ని దాటితే భారీ వర్షాలు, వరదలు ముంచెత్తి పెను విలయం సృష్టించే ప్రమాదం ఉందని ఆ సంస్థ తెలిపింది. అయితే పైలీన్ పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉందని, అది దేశంలో సగం సైజులో లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డెరైక్టర్ పేర్కొన్నారు.
220 కి.మీ. వేగంతో తీరం దాటే అవకాశం....
ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం, ఒడిశాలోని పారాదీప్‌ల మధ్య శనివారం రాత్రి గంటకు 220 కి.మీ. వేగంతో వీచే గాలులతో పై-లీన్ తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. అయితే తుపాను గంటకు 315 కి.మీ. వేగంతో వీచే గాలులతో విరుచుకుపడే అవకాశముందని ‘జేటీడబ్ల్యూసీ’, లండన్‌లోని ‘ట్రాపికల్ స్టార్మ్’ సంస్థల నిపుణులు హెచ్చరించారు. 1999 నాటి ఒడిశా సూపర్ సైక్లోన్ 220 కి.మీ. వేగంతో కూడిన గాలులతో విరుచుకుపడిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.
వెంటనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే గనక.. అనూహ్యరీతిలో ప్రాణనష్టం, లక్షలాది మందిపై ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు. 1999లో వచ్చిన ఒడిశా సైక్లోన్ ధాటికి సుమారు 10 వేల మంది మృత్యువాత పడగా.. 450 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఆ తుపాను తీరం దాటిన ప్రదేశం వైపుగానే దాదాపు అదే తీవ్రతతో పై-లీన్ కూడా సాగుతోంది. అయితే హరికేన్ హంటర్ విమానాలు లేకపోవడంతో పై-లీన్ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా.. ఈ తుపాను 300 కి.మీ. వేగాన్ని మించి విజృంభించనుందని, అదే జరిగితే బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత పెను తుపానుగా ఇది రికార్డులకు ఎక్కనుందని చెబుతున్నారు.
‘కత్రినా’ను మించే విలయం..?
అమెరికాను 2005లో వచ్చిన కత్రినా హరికేన్ అతలాకుతలం చేసింది. వేల కోట్ల డాలర్ల నష్టాన్ని కల్గించడమే కాకుండా 1,800 మందిని ఆ హరికేన్ పొట్టనపెట్టుకుంది. అయితే ఆ హరికేన్ కన్నా పై-లీన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఉపగ్రహ చిత్రాల సమాచారాన్ని బట్టి చూస్తే.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వేసిన అంచనాలకు మించి పైలీన్ తీవ్రత పెరగవచ్చని జేటీడబ్ల్యూసీ, ట్రాపికల్ స్టార్మ్ నిపుణులు భావిస్తున్నారు.