కోర్టుకు చేరిన డీడీసీఏ రగడ
ఆప్ నేతలపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేసిన జైట్లీ
కేజ్రీవాల్ సహా ఐదుగురు నేతలపై రూ.10 కోట్లకు కేసు
♦ కేసులకు భయపడేది లేదన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చట్టపరచర్యలకు దిగారు. కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలు కుమార్ బిశ్వాస్, అశుతోష్, సంజయ్‌సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్‌పేయిపై రూ. పది కోట్లకు పాటియాలా హౌస్ కోర్టులో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలను వేశారు. వారం క్రితం కేజ్రీవాల్ ఆఫీసులో ఆయన ముఖ్య కార్యదర్శిపై సీబీఐ దాడులు చేయడంతో వివాదం చెలరేగింది. డీడీసీఏకి జైట్లీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీనికి సంబంధించిన ఫైలు కోసమే సీబీఐ సీఎంవోలో సోదాలు జరిపిందని ఆప్ నేతలు ఆరోపించడం తెలిసిందే.
వారు తనపై అబద్ధపు, అపఖ్యాతిని కలిగించే ప్రచారం చేశారని, దీని వల్ల తనకు తిరిగి పూడ్చలేని నష్టం కలిగిందని జైట్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులతో పాటియాలా కోర్టుకు వచ్చిన జైట్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సంజయ్ ఖనాగ్వాల్ వద్ద క్రిమినల్ దావా వేశారు. ఐపీసీ 499(పరువు నష్టం), 500(శిక్షార్హమైన నేరం), 501, 502(పరువుకు నష్టం కలిగించే వార్తల ముద్రణ, అమ్మకం) తదితరాల కింద ఫిర్యాదు చేశారు. నిందితులపై ఆరోపణలు రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష కూడా పడొచ్చు. జైట్లీ వెంట కేంద్ర మంత్రులు వెంకయ్య, ఇరానీ తదితరులున్నారు.
జైట్లీ న్యాయవాది లూద్రా వాదనలు వినిపిస్తూ.. వెంటనే జైట్లీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలన్నారు. అయితే ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా చెప్పిన కోర్టు కేసు విచారణను జనవరి 5కు వాయిదా వేసింది. అప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేస్తామంది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీ సహా ఆప్ నేతలపై జైట్లీ సివిల్ పరువు నష్టం దావా వేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై ఆప్ నేతలు పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని ఆరోపించారు. సివిల్ కేసులో పరువుకు నష్టం కలిగించినందుకు రూ. 10 కోట్లు చెల్లించాలని కోర్టును కోరామని జైట్లీ లాయరు మోనికా డోగ్రా చెప్పారు.
అవినీతిపై పోరు కొనసాగుతుంది: కేజ్రీ
తనపైనా, తన పార్టీ నేతలపైనా సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులు దాఖలు చేసినంత మాత్రాన భయపడబోమని, అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని కేజ్రీ స్పష్టం చేశారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందు హాజరై జైట్లీ తన నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఢిల్లీ సర్కారు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌కు ఢిల్లీ కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. డీడీసీఏ అంశంపై మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ భేటీ నిర్వహించాలనీ నిర్ణయించింది. కాగా, డీడీసీఏ అంశాన్ని లేవనెత్తిన వాళ్లలో తానూ ఉన్నానని, జైట్లీ తనపైన దావా ఎందుకు వేయలేదని బీజేపీ ఎంపీ కీర్తీ ఆజాద్ అన్నారు. కేజ్రీవాల్ తరఫున న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించనున్నారు.