అట్టుడికిన ఉభయ సభలు | Dear Smriti Irani, are politicians not political? | Sakshi
Sakshi News home page

అట్టుడికిన ఉభయ సభలు

Published Thu, Feb 25 2016 3:24 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

అట్టుడికిన ఉభయ సభలు - Sakshi

అట్టుడికిన ఉభయ సభలు

జేఎన్‌యూ, రోహిత్ అంశాలపై అధికార, విపక్షాల వాగ్యుద్ధం
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం.. హైదరాబాద్ కేంద్రీ విశ్వవిద్యాలయంలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య అంశాలు బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిధ్వనించాయి. లోక్‌సభలో ఈ అంశాలపై చర్చ సందర్భంగా.. ప్రభుత్వం యువత గళాన్ని నొక్కివేస్తోందని, ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తోందని విపక్షం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దీనికి ప్రతి దాడిగా.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా నిర్ధారితుడై మరణశిక్షకు గురైన అఫ్జల్‌గురును బలపరస్తున్న వారికి మద్దతిచ్చారంటూ బీజేపీ విరుచుకుపడింది.

సభ పార్లమెంటుపై దాడి చేసిన వారి వైపు నిలుస్తుందా.. లేక దాని రక్షణలో ప్రాణాలు అర్పించిన వారివైపు నిలుస్తుందా అనేది నిర్ణయించాల్సి ఉందని బీజేపీ పేర్కొంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు చర్చలో అధికార, విపక్షాలు రెండూ తాము జాతీయవాదులమేనని ఉద్ఘాటిస్తూనే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాజ్యసభలో కూడా గందరగోళం, తీవ్ర వాగ్యుద్ధం జరిగాయి.

లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా చర్చను ప్రారంభించారు. బీజేపీ ఎంపీ అనురాగ్‌ఠాకూర్ మాట్లాడుతూ రాహుల్‌పై విమర్శలు ఎక్కుపెట్టగా కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. రాహుల్‌పై అవమానకరమైన ఆరోపణలు చేస్తున్నారని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దానిని స్పీకర్ తిరస్కరించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుగతాబోస్ ప్రసంగానికి సభలో పలువురు సభ్యులు ప్రశంసించారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌లు ఆయన వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు.

హెచ్‌సీయూ, జేఎన్‌యూ అంశాలను ఎవరూ రాజకీయం చేయరాదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘మీకు 80 వేల మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. కానీ మీరు ఎనిమిది, పది మంది విద్యార్థులను పట్టుకోలేకపోయారు. ఇది కాంగ్రెస్ తప్పా?’’ అని ప్రశ్నించారు.  దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రభుత్వం సహించబోదని  మంత్రి వెంకయ్య నాయడు అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి కుటుంబమే తొలి ప్రాధాన్యం. పార్టీ తరువాతి ప్రాధాన్యం.

దేశం చివరి ప్రాధాన్యం. మాకు దేశం తొలి ప్రాధాన్యం. పార్టీ తరువాతి ప్రాధాన్యం. కుటుంబం చివరి ప్రాధాన్యం’ అని అనురాగ్ ఠాకూర్(బీజేపీ) అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలోనూ ఇటువంటి సమస్యలు కనిపింయని అయితే  పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పరిస్థితిని శాంతపరచేందుకు ప్రయత్నించిందని సుగతాబోస్ (తృణమూల్) అన్నారు.  ‘రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరం. జేఎన్‌యూ విద్యార్థిపై రాజద్రోహం అభియోగం మరీ కఠినమైన చర్య’ అని పి. రవీంద్రబాబు(టీడీపీ) అన్నారు. జాతీయవాదమనేది బీజేపీ పేటెంట్ కాదని కొండారెడ్డి(టీఆర్‌ఎస్) పేర్కొన్నారు.
 
రాజ్యసభలో బీఎస్‌పీ ఆందోళన
రోహిత్  ఆత్మహత్యపై మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ సభ్యులు రాజ్యసభలో తీవ్ర ఆందోళనకు దిగారు. మాయావతి రోహిత్ అంశాన్ని లేవనెత్తటంతో దుమారం చెలరేగింది. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తగా.. మరణించిన బాలుడిని(రోహిత్‌ను) విపక్షం రాజకీయ పనిముట్టుగా, వ్యూహంగా వాడుకుంటోందని ఇరానీ ఎదురు దాడి చేశారు. రోహిత్ మరణంపై దర్యాప్తు జరుపుతున్న కమిటీలో దళిత వ్యక్తిని సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్న మాయావతి.. రోహిత్ అంశాన్ని నిర్లక్ష్యం చేయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వాటికి బీఎస్‌పీ అధినేత్రి సంతృప్తి చెందకపోతే తన తల నరికి ఆమె పాదాల వద్ద పెట్టటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ అంశం కాసేపటి తర్వాత చర్చకు రానుందని.. సభ అంగీకరిస్తే తక్షణమే చర్చకు చేపట్టవచ్చని సభాపతి స్థానంలోని డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ పేర్కొన్నారు. కానీ మాయావతి ప్రసంగించటం కొనసాగించారు. రోహిత్ ఘటన  25 కోట్ల మంది దళితులను అవమానించటమేనని.. ఆ ఘటనకు సంబంధించి ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయటంతో పాటు, హెచ్‌సీయూ వీసీని తొలగించాలన్నారు.  బీఎస్‌పీ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లడంతో సభ వాయిదా పడింది.
 
ఇరానీ, దత్తాత్రేయలది అనవసర జోక్యం: సింధియా
‘‘రోహిత్ ఉదంతంలో ఇరానీ, కార్మిక  మంత్రి బండారు దత్తాత్రేయలు అనవసర జోక్యం చేసుకున్నారు. దత్తాత్రేయ తన లేఖలో రోహిత్‌ను కులవాదిగాను, దేశవ్యతిరేకిగాను అభివర్ణించారు.. యువత గొంతును నొక్కివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రాజకీయాల కారణంగా హెచ్‌సీయూ వీసీ దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారు. జేఎన్‌యూపై ప్రభుత్వానికి కోపం ఉంది. . కాషాయ ఉగ్రవాదానికి, దాద్రీలో వ్యక్తిని కొట్టి చంపటానికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు,  రోహిత్ వేముల ఆత్మహత్యకు వ్యతిరేకంగా అది నిలిచింది కాబట్టి. కన్హయ్య.. సంఘ్‌ను వ్యతిరేకించినందువల్ల లక్ష్యంగా చేసుకున్నారు’’.
 
ప్రభుత్వ హస్తం లేదు: రాజ్‌నాథ్
లోక్‌సభలో బుధవారం రోజంతా జరిగిన చర్చ తర్వాత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం చెప్పారు. ‘‘జేఎన్‌యూ విద్యార్థులపై తీసుకున్న చర్యలో ప్రభుత్వ హస్తం లేదు. అక్కడ దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు చర్య తీసుకుంటున్నారు. కొందరు విద్యార్థులపై మోపిన రాజద్రోహం అభియోగం అంశంపై నిర్ణయాన్ని కోర్టులకు వదిలిపెట్టాలి.  నేను నిరాధారంగా లేదా.. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆధారం లేనిదే ఏ వ్యాఖ్యా  చేయను. జేఎన్‌యూ విద్యార్థులకు లష్కరే చీఫ్ హఫీజ్‌సయీద్ మద్దతు ఇచ్చారన్న అంశంపై గోప్యత దృష్ట్యా వివరాలు చెప్పలేను’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement