ఢిల్లీ: జేఎన్యూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లోని ఘటనలపై బుధవారం రాజ్యసభలో దుమారం రేగింది. ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలతో బుధవారం సభ పలుమార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ కురియన్ సభను గురువారానికి వాయిదా వేశారు.
అంతకు ముందు ఢిల్లీ యూనివర్సిటీ ఘటనపై సభలో ప్రతిపక్షాల వైఖరిని తప్పుపడుతూ బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్.. ఉగ్రవాది అఫ్జల్ గురు మీకు దేశద్రోహినా లేక అమరవీరుడా తెలపాలని కోరారు. అఫ్జల్ టెర్రరిస్టా కాదా అనే విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలపాలని ఆయన ప్రశ్నించారు.
సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య, జేఎన్ యూ వివాదంపై ప్రభుత్వం విడివిడిగా చర్చకు అంగీకరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యపై చర్చకు పట్టుబట్టిన బీఎస్పీ లీడర్ మాయావతితో తాము ఏకీభవిస్తామన్న ఆయన ఢిల్లీ ఘటనపై కూడా చర్చ జరగాల్సిందేనన్నారు.