లైంగికదాడి కేసులో నిందితుడికి ఉరి
⇒ కోవై మహిళా కోర్టు తీర్పు
చెన్నై: మహిళా ప్రొఫెసర్ పై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడు మహేష్ (30)కి కోయంబత్తూరు మహిళా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం మేరకు.. కోయంబత్తూరు జిల్లా కారమడై సమీపం ఆశిరియర్ కాలనీకి చెందిన రమ్య(24) కనుత్తుకడవులోని ప్రయివేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2014 నవంబరు 3న కళాశాలలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమెను వెంబడించాడు. అనంతరం ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి రమ్య, ఆమె తల్లి మాలతిలపై దుడ్డుకర్రతో దాడి చేయడంతో వారు స్పృహ తప్పి పడిపోయారు.
ఇదే అదనుగా ఇంటిలోని బంగారు నగలను దోచుకున్నాడు. స్పృహ తప్పిన స్థితిలో పడి ఉన్న రమ్యపై లైంగికదాడికి పాల్పడడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ కేసులో తిరునెల్వేలీ జిల్లా తెన్‌కాశీకి చెందిన మహేష్‌ను గత ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అతడి నేరం రుజువు కావడంతో కోయంబత్తూరు మహిళా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. హత్య చేసినందుకు ఉరిశిక్ష, లైంగికదాడి జరిపినందుకు యావజ్జీవ శిక్ష, అనుమతి లేకుండా వారి ఇంటిలోకి ప్రవేశించినందుకు 8 ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన తీర్పులో పేర్కొంది.