నిందితులను విజయవాడ మహిళా కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్తున్న పోలీసులు
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో గత ఏడాది ఏప్రిల్ 19, 20వ తేదీల్లో 22 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి కేసులో దారా శ్రీకాంత్ (ఏ–1) అనే యువకుడికి జీవిత ఖైదు.. రూ.7 వేల జరిమానా, చెన్నా బాబూరావు (ఏ–2), జరాంగుల పవన్ కళ్యాణ్ (ఏ–3) అనే యువకులకు 20 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ ఐదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఐ.శైలజాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ‘దిశ’ చొరవ కారణంగా సరిగ్గా ఏడాదిలోనే దోషులకు శిక్ష పడటం గమనార్హం. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది.
అప్పట్లో నిందితులు శ్రీకాంత్, బాబురావులు ఆస్పత్రిలోని పెస్ట్ కంట్రోల్ విభాగంలో ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవారు. మూడో నిందితుడు పవన్‌కల్యాణ్.. బాబురావుకు స్నేహితుడు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన బాధిత యువతిని శ్రీకాంత్ ప్రేమించానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి 19వ తేదీ రాత్రి శ్రీకాంత్ పని చేసే ఆస్పత్రికి వచ్చింది. ఆ రాత్రి ఆస్పత్రిలోని ఓ గదిలో ఆ యువతిపై శ్రీకాంత్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
20వ తేదీ ఆ యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయం గమనించిన బాబురావు, పవన్‌కల్యాన్‌లు యువతిపై అత్యాచారం చేశారు. అయితే 19వ తేదీ రాత్రి తన కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని ఓ గదిలో యువతి ఉందన్న విషయం తెలుసుకుని ఆమె తల్లి, బంధువులు 20వ తేదీ రాత్రి 8 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో గదిలో యువతితో పాటు పవన్‌కల్యాణ్ ఉన్నాడు. వీరిని చూసి అతను అక్కడ నుంచి పారిపోవడంతో యువతిని ఇంటికి తీసుకెళ్లారు. 22వ తేదీన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దర్యాప్తు చకచకా..
మెరుగైన దర్యాప్తు కోసం కేసును నున్న పోలీస్ స్టేషన్ నుంచి దిశ పోలీస్ స్టేషన్‌కు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా బదిలీ చేశారు. ఏప్రిల్ 22వ తేదీనే కేసు నమోదు చేసి, అదే రోజు నిందితులను కోర్టులో హాజరు పర్చారు. సెప్టెంబర్‌లో కేసు ట్రయిల్ ప్రారంభమైంది. విచారణ అధికారి, దిశ ఏసీపీ వి.వి.నాయుడు, ఎస్‌ఐ రేవతి, కోర్టు మానిటరింగ్‌సెల్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు సేకరించిన ఆధారాలు పక్కాగా ఉండటంతో త్వరగా ట్రయిల్ పూర్తయింది.
చదవండి: 'నేను డేంజర్‌లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో..
ఈ కేసులో 25 మంది సాక్షులను కోర్టు విచారించింది. బాధితురాలి తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చద్రగిరి విష్ణువర్ధన్ కోర్టుకు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే కేసు త్వరగా ట్రయిల్ పూర్తి చేసుకుందని ఏపీపీ విష్ణువర్ధన్ తెలిపారు. దిశ పోలీసులు సమర్థవంతంగా తగిన సాక్ష్యాధారాలను సేకరించడంతో ఏడాదిలోనే తీర్పు వచ్చిందన్నారు. కాగా, అప్పట్లోనే బాధితురాలికి ప్రభుత్వం రూ.10 లక్షల చెక్కును అందజేయడంతో పాటు అన్ని విధాలా అండగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment