ఖలీల్‌వాడి: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన ఓ మారుతండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలు స్తూ రెండు జీవితఖైదులు విధించింది. ఈ మేరకు నిజామాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్‌చార్జి సెషన్స్ జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పు చెప్పారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన దేవకత్తె గోవింద్‌రావు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాడు. అక్కడ భర్తను విడిచిపెట్టి ఐదేళ్లు, రెండేళ్ల వయసుగల ఇద్దరు కూతుళ్లతో ఉంటున్న ఓ మహిళ పరిచ యం కావడంతో ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు.
ఆ తర్వాత వారు వివాహం చేసుకొని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలో ఓ వ్యవసాయదారుని వద్ద జీతానికి పనిచేస్తున్నారు. అయితే గతేడాది పెద్ద బాలి క కాలికి గాయం కావడంతో గోవింద్‌రావు 2022 అక్టోబర్ 20న అదే గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అనంతరం బాలికను నేరుగా ఇంటికి తీసుకురాకుండా మెంట్రాజ్‌పల్లి వెళ్లే దారిలోని పొలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలిక ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచాడు. స్పృహ కోల్పోయిన బాలికను ఇంటికి తీసుకొచ్చాడు.
ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నడుచుకుంటూ వెళ్లిన బాలిక అపస్మారకస్థితిలో ఉండటంతో ఏం జరిగిందో చెప్పాలని బాలిక తల్లి నిలదీసింది. దీంతో గోవింద్‌రావు అసలు విషయం చెప్పడంతో బాలికను తల్లి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్‌కు తీసుకెళ్లింది. కానీ అప్పటికే బాలిక మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి న నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ముద్దాయి నేరం ఒప్పుకోలు స్వాధీన పంచనామా, సీసీటీవీ ఫుటేజీ, బాలిక పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదికలతోపాటు ఇతర సాక్ష్యాలను జతచేసి అభియోగ పత్రాన్ని పోక్సో కోర్టులో సమర్పించారు.
న్యాయ విచారణలో 24 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టు నమోదు చేసింది. వివిధ సెక్షన్ల కింద గోవింద్‌రావుపై నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ అత్యాచారం నేరానికిగాను జీవిత ఖైదు, దాడి చేసి బాధితురాలి మృతికి కారణమైనందున హత్యా నేరానికిగాను మరో జీవితఖైదును జడ్జి విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని సెషన్స్ జడ్జి సునీత తీర్పులో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment