అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీపై న్యాయ విచారణలో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. విచారణ కమిషన్ కార్యాలయ ఏర్పాటు పనులు పూర్తికాకపోవడమే జాప్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్య కారణాలతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తరువాత బాహ్య ప్రపంచంలోకి రాకుండానే కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయ కోలుకుంటున్నారు.. కోలుకున్నారు.. నేడో రేపో డిశ్చార్జ్.. అంటూ పార్టీ నేతలు, వైద్యులు ప్రచారం చేశారు. 75 రోజులపాటు జరిగిన ప్రచారానికి భిన్నంగా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జయ కన్నుమూశారు. చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోలు విడుదల చేయాలని పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోర్కెను ఎవరూ వినిపించుకోలేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. జయ మరణంపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చీలిక వర్గ నేతగా ఉన్న సమయంలో పన్నీర్‌సెల్వం సైతం న్యాయవిచారణకు డిమాండ్ చేశారు. నలువైపులా ఒత్తిడి పెరగడంతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి న్యాయవిచారణ కమిషన్ ఏర్పాటుచేసి రిటైర్డు న్యాయమూర్తి ఆరుముగస్వామిని చైర్మన్‌గా నియమించారు. జయ మరణంపై మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని గత నెల 25వ తేదీన సీఎం ఆదేశాలు జారీచేశారు. చెన్నై మెరీనాబీచ్ రోడ్డులోని ఎళిలగం భవనంలోని ప్రత్యేక కార్యాలయంలో విచారణ కమిషన్ చైర్మన్‌గా ఆర్ముగస్వామి గత నెల 30వ తేదీన బాధ్యతలు చేపట్టారు.
గతంలో నిర్ణయించిన ప్రకారం బుధవారం నుంచి విచారణ ప్రారంభించాల్సి ఉంది. చైర్మన్ ఆరుముగస్వామి బుధవారం ఉదయం కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభిస్తారని అధికార వర్గాల్లో మంగళవారం ప్రచారం జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి చేరుకున్నారు. మ«ధ్యాహ్నం 2 గంటలు దాటినా చైర్మన్ రాలేదు. కారణం కోసం ఆరా తీయగా, రిటైర్డు న్యాయమూర్తికి కేటాయించిన చాంబర్‌లో తలుపులు, కిటికీలు, టైల్స్ అమరిక పనులు జరుగుతున్నాయని సిబ్బంది చెప్పారు. అంతేగాక టేబులు, కుర్చీలు, టెలిఫోన్ వసతి కూడా కల్పించలేదని తెలిపారు. విచారణ కమిషన్‌కు సహకరించే సిబ్బంది కార్యాలయపు గదుల్లో సైతం పనులు సాగుతున్నాయని అన్నారు. విచారణ ప్రారంభించడానికి ఇంకా కొన్నిరోజులు పడుతుందని సిబ్బంది వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి పరిశీలిస్తే నివేదిక సమర్పణకు ఇచ్చిన మూడు నెలల గడువులో ఒక నెల పూర్తయింది. విచారణ ప్రారంభం కాకుండానే నెలరోజులు పూర్తికావడం, కార్యాలయ పనులు ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో గడువు ప్రకారం డిసెంబరు 25వ తేదీ నాటికి నివేదిక అనుమానమేని నిర్ధారించుకోవాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment