ఢిల్లీ ఎన్నికలు : ముగిసిన పోలింగ్‌ | Delhi Assembly Election 2020: Polling Live Updates in Telugu | Sakshi
Sakshi News home page

ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

Published Sat, Feb 8 2020 7:42 AM | Last Updated on Sat, Feb 8 2020 7:30 PM

Delhi Assembly Election 2020: Polling Live Updates in Telugu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చెదురుమదురు ఘటనలు మినహా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 57.06 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ఓటు వేసేందుకు 13,750 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 5 వేల మంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలు, 190 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.  

మరో రెండు గంటలు మాత్రమే
మరో రెండు గంటల్లో ఢిల్లీ ఎన్నికలు ముగియనున్నాయి. కానీ పోలింగ్‌ శాతం మాత్రం పెద్దగా పెరగడం లేదు. సాయంత్రం నాలుగు గంటలకు 42.20శాతంగా పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం మూడు గంటలకు 30.18శాతంగా, రెండు గంటలకు 28శాతంగా, ఒంటిగంటకు 19.37శాతంగా పోలింగ్‌ నమోదైంది.

క్రమంగా పెరుగుతున్న పోలింగ్‌ శాతం
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం మూడుగంటల సమయానికి 30.18శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి కేవలం 28శాతం ,ఒంటిగంటలోపు  19.37 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. 12 గంటల సమయానికి 15.57 శాతం నమోదయింది. 

ఓటేసిన ప్రియాంక గాంధీ కుమారుడు
 కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కుమారుడు రెహాన్‌ రాజీవ్‌ వాద్రా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

 ఓటేసిన పెళ్లికొడుకు
లక్ష్మీనగర్‌ నియోజకవర్గంలోని శాఖర్పూర్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం పెళ్లివారి రాకతో సందడిగా మారింది. మరికాసేపట్లో పెళ్లి ఉందనగా.. ఓటు వేసి మరీ వెళ్లాడు సదరు పెళ్లికొడుకు. ఆయనతో పాటు బంధువులు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి రావడం విశేషం. ‘ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన భవిష్కత్‌ కోసం ఓటు హక్కును వినియోగించుకుకోవాలి. ఓటేసిన తర్వాత నా వివాహ కార్యక్రమానికి వెళ్తాను​’ అని పెళ్లి కొడుకు అన్నాడు. కాగా, ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకున్న ఆ కుటుంబానికి ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

మందకొడిగా పోలింగ్‌
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కేవలం 19.37 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. 12 గంటల సమయానికి 15.57 శాతం నమోదయింది. జాతీయ ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా.. నిర్మాణ్‌ భవన్‌లో ఓటు వేశారు. ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర, ఆయన భార్య నీలూ చంద్ర.. న్యూ మోతిబాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అల్కా ఆగ్రహం
మంజు-కా-తిల్లా పోలింగ్‌ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి అల్కా లంబా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను శాంతింపజేశారు. అసభ్య పదజాలంతో దూషించడంతో ఆప్‌ కార్యకర్తపై అల్కా మండిపడ్డారు. అయితే ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజయ్‌ సింగ్‌ తెలిపారు.

‘పొన్ను పరివార్‌ ఓటు’
హీరోయిన్‌ తాప్సీ పొన్ను తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘పొన్ను పరివార్‌ ఓటు వేసింది. మీరు ఓటు వేశారా? ప్రతి ఓటు లెక్కించబడుతుంది’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. తన సోదరి షగున్‌ పొన్నుతో కలిసి కారులో ఓటు వేయడానికి వెళుతున్న ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తాప్సీ పోస్ట్‌ చేసింది.

బద్దకించకుండా ఓటు వేయండి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఆయన భార్య గురుశరణ్‌ సింగ్‌.. నిర్మాణ్‌ భవన్‌లో ఓటు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఇక్కడే ఓటు వేశారు. ప్రియాంక గాంధీ వాద్రా.. లోధి ఎస్టేట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బద్దకించకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపునిచ్చారు. ఓటు వేయడం చాలా ముఖ్యమని చెప్పారు. రాహుల్‌ గాంధీ.. ఔరంగజేబు రోడ్డులో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

సతీసమేతంగా రాష్ట్రపతి ఓటు
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఆయన సతీమణి సవితా కోవింద్‌.. ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఆయన భార్య గురుశరణ్‌ సింగ్‌.. నిర్మాణ్‌ భవన్‌లో ఓటు వేశారు. ఉదయం 11 గంటలకు వరకు 6.96 శాతం పోలింగ్‌ నమోదయింది.

ఎన్నికల విధుల్లో విషాదం
ఈశాన్య ఢిల్లీలోని బాబర్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉధమ్‌సింగ్‌ అనే వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన భౌతిక కాయాన్ని పోలీసులు పోలిం​గ్‌ కేంద్రం నుంచి తరలించారు. ఎన్నికల అధికారి మరణంతో  కాసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. తర్వాత యథావిధిగా పోలింగ్‌ కొనసాగింది.

మహిళలకు కేజ్రీవాల్‌ విజ్ఞప్తి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి సివిల్‌ లైన్స్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. ఢిల్లీ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ కోరారు. మహిళలు తప్పనిసరిగా ఓటు వేయాని విజ్ఞప్తి చేశారు. పనితీరుగా ఆధారంగా హస్తిన వాసులు ఓటు వేస్తారని ఆయన అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆయన భార్య సీమ సిసోడియా.. పాండవ్‌ నగర్‌లోని ఎంసీడీ పాఠశాలలో ఓటు వేశారు.

ఈవీఎంల మొరాయింపు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు పలుచోట్ల అవాంతరాలు ఎదురయ్యాయి. యమునా విహార్‌లోని సీ10 బ్లాక్‌ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం 9 గంటలకు వరకు అక్కడ ఓటింగ్‌ ప్రారంభం కాలేదు. ఎన్నికల సంఘం సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. ఓటు వేసేందుకు వచ్చిన జనం పోలింగ్‌ కేంద్రం ముందు బారులు తీరారు.

తల్లితో కలిసి ఓటు వేసిన కేంద్ర మంత్రి
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌ తన తల్లితో కలిసి కృష్ణానగర్‌లోని రతన్‌ దేవి పబ్లిక్‌ స్కూల్‌లో ఓటు వేశారు. జస్టిస్‌ ఆర్‌. భానుమతి.. తుగ్లక్ క్రెసెంట్‌ ప్రాంతంలోని ఎన్‌ఎండీసీ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ.. మాటియాల నియోజవర్గంలో తన ఓటు వేశారు.

ఓటు వేసిన జైశంకర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌.. తుగ్లక్ క్రెసెంట్‌ ప్రాంతంలోని ఎన్‌ఎండీసీ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఢిల్లీ పౌరులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

మంచి భవిష్యత్తు కోసం ఓటు
ఈ రోజు ఢిల్లీ ప్రజలు నాణ్యమైన విద్య, తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఓటు వేయబోతున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు. ప్రతాప్‌ గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున రవి నేగి పోటీలో ఉన్నారు.

భద్రత నడుమ పోలింగ్‌ ప్రారంభం
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు.



అభ్యర్థుల పూజలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే ప్రార్థనాలయాల బాట పట్టారు. ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. హరినగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తాజిందర్‌ పాల్‌ సింగ్ ఈ ఉదయం ఫతేనగర్‌ గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వాహనాల తనిఖీ
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను పెంచారు. జామియా ప్రాంతంలో శనివారం తెల్లవారుజాము నుంచి వాహనాలను భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మరిన్ని ప్రాంతాల్లో వాహనాల సోదాలు కొనసాగాయి.

పోలింగ్‌కు సిద్ధం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఓటు వేసేందుకు 13,750 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. 1.47 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 5 వేల మంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలు, 190 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌తో బందోబస్తు ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై షహీన్‌బాగ్‌లో నిరసనలు, జేఎన్‌యూలో హింస వంటి ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు
ఓటింగ్‌పై నగర ప్రజల్లో నిరాసక్తత పోగొట్టడానికి ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. ఓటర్లను గుర్తించడానికి ఎన్నికల సిబ్బంది క్యూఆర్‌ కోడ్స్, మొబైల్‌ యాప్స్‌ని వాడుతున్నారు. ఓటర్లు స్మార్ట్‌ ఫోన్‌లను వెంట తెచ్చుకోవడానికి కూడా అనుమతినిచ్చారు. ఓటరు కార్డు లేకపోయినా క్యూ ఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేసి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తారు. షహీన్‌బాగ్‌లో నిరసనకారుల్ని ఎన్నికల సిబ్బంది స్వయంగా కలుసుకొని ఓటు వేయాలని కోరారు. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు తరలిరావడానికి వీలుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్న 30 నియోజకవర్గాల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచే కార్యక్రమాలను ఈసీ చేపట్టింది. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు ఉచితంగా చేరవేస్తామని టూవీలర్‌ ట్యాక్సీ సేవల సంస్థ ర్యాపిడో ప్రకటించింది. మూడు కిలోమీటర్ల వరకు ఓటర్ల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపింది. కాగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 28 మంది, పటేల్‌నగర్‌ నుంచి అతి తక్కువగా నలుగురే పోటీలో  ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement