సాక్షి, ఢిల్లీ: హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ఒకరు పాడిన పాట అందరి ప్రశంసలను అందుకుంటోంది. రహదారి భద్రత గురించి ఉన్న ఈ పాట వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ సినిమాలోని 'ఆప్నా టైమ్ ఆయేగా..' పాటను తన వెర్షన్‌లో పాడాడు. రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకోండంటూ సలహాలను చరణాలుగా మలిచాడు. 42 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రోడ్డు భద్రతపై సందేశాన్నిచ్చే విధంగా సొంత లిరిక్స్‌నుపయోగించాడు సందీప్ సాహి అనే ట్రాఫిక్ పోలీస్.
సందీప్ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటినుంచి రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాడు. హెల్మెట్స్, సీట్‌బెల్ట్ ధరించండని ప్రస్తుత పాటలో వాహనదారులకు పిలుపునిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని కోరుకుంటున్నాడు. ‘నేను చెప్పేది పాటించండి.. హాయిగా జీవించండి’ అని తన వీడియో ద్వారా సందేశాన్నిచ్చాడు. అదే సమయంలో తాగి వాహనాలు నడిపే వారిని హెచ్చరించాడు. 'జై హింద్, జై భారత్' అంటూ పాట ముగించాడు. ఈ వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ అతని పాటకు పూర్తిగా ఫిదా అయ్యామని, అందుకు 10కి 10 మార్కులు ఇవ్వొచ్చని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసులే మాకు కావాల్సింది అంటూ అతనికి సెల్యూట్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ రణవీర్ కూడా చూశాడో, లేదో తెలియాలి!
Comments
Please login to add a commentAdd a comment