![Delhi Fire: CM Kejriwal orders probe, Rs 10 lakh for families of victims - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/8/delhi-fire_5.jpg.webp?itok=z-YGBapF)
సాక్షి, న్యూఢిల్లీ : అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆదివారం ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ...‘అగ్నిప్రమాదంలో 43మంది అమాయకులు మృతి చెందారు. చనిపోయినవారి ప్రాణాలు తెచ్చివ్వలేం. అయితే ఢిల్లీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది’ అని తెలిపారు.
చదవండి: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, 43మంది మృతి!
మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడి లోక్‌నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ ప్రమాదంలో సుమారు 15మంది గాయపడ్డారని, క్షతగాత్రుల్లో ఒకరికి 50శాతం గాయాలు అయ్యాయని, మిగతా ఎనిమిది మంది దట్టమైన పొగ పీల్చడం కారణంగా అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి, వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధ్యులను ఉపేక్షించేది లేదని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
అతి భయంకరమైన సంఘటన: ప్రధాని
మరోవైపు ఈ ఘోర అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'అతి భయంకర సంఘటన నన్ను తీవ్రంగా బాధించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అనిప్రధాని ట్వీట్ చేశారు. సహాయక చర్యలకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి కింద రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50వేలు తక్షణ సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
భవన యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
కాగా ఢిల్లీలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఓ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకూ 43మంది మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో కార్మికులంతా నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భవనం యజమాని మహ్మద్ రెహన్‌పై ఐపీసీ సెక్షన్ 304 కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా, యజమాని సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లను ఉపయోగించారు. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment