కీచక మైనర్‌కు మూడేళ్ల జైలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసు నిందితుల్లో ఒకరికి శిక్ష పడింది. గత డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో మైనర్ యువకుడి(బస్సు క్లీనర్)పై మోపిన అత్యాచారం, హత్య అభియోగాలను ధ్రువీకరించిన జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) శిక్ష ఖరారు చేసింది. బాల నేరస్తుల చట్టం కింద విధించే మూడేళ్ల గరిష్ట శిక్షకే పరిమితమై శనివారం తీర్పు వెలువరించింది. విచారణలో భాగంగా ఇప్పటికే 8 నెలల పాటు కస్టడీలో ఉన్నందున ఈ కాలాన్ని శిక్షాకాలం నుంచి మినహాయించనున్నారు. నేరానికి పాల్పడిన సమయంలో ఈ నిందితుడు 18 ఏళ్ల మెజారిటీ వయసుకు కేవలం ఆరు నెలలు మాత్రమే తక్కువగా ఉన్నా డు. ఈ కారణంగానే బాల నేరస్తులను విచారించే జేజేబీ ఇతని కేసు విచారించింది. బోర్డు తీర్పుతో తీవ్ర ఆవేదనకు గురైన నిర్భయ సోదరుడు బాల నేరస్తుడిపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి.
గత డిసెంబర్ 16 నాటి రాత్రి ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిపైనా (ఈ యావత్ ఉదంతానికి ఇతనొక్కడే ప్రత్యక్ష సాక్షి) దాడి చేశారు. తీవ్రగాయాలతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న నిర్భయ మరణించింది. ఈ కేసులో నలుగురు నిందితులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారిస్తోంది.
మరో నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్‌లో గత మార్చి 11న విగతజీవుడై కన్పించాడు. మైనర్ నిందితుడి విచారణను చేపట్టిన ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ నేతృత్వంలోని జేజేబీ బాల నేరస్తుడిని మూడేళ్లపాటు ప్రత్యేక ప్రొబేషన్ హోమ్‌లో ఉంచాలని పేర్కొంటూ ఎట్టకేలకు శనివారం తీర్పునిచ్చింది. 60 పేజీల తీర్పులోని వివరాలను బయటకు వెల్లడించరాదంటూ.. నిందితులతో పాటు కోర్టుకు హాజరైనవారిని, పోలీసులను, డిఫెన్స్ న్యాయవాదిని, నిర్భయ కుటుంబసభ్యులను ఆదేశించిన బోర్డు తలుపులు మూసిన గదిలో తీర్పు ప్రకటించింది.
మరణశిక్ష విధించాలి: నిర్భయ తండ్రి
బాల నేరస్థుడు కేవలం మూడేళ్ల శిక్షతో బయటపడటంపై నిర్భయ తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అతనికి మరణశిక్ష విధించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. తీర్పుపై తాము అప్పీల్ చేస్తామన్నారు. ఆమె తల్లి సైతం తీర్పుపై తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు. కోర్టు నుంచి బయటకు రాగానే విలపిం చడం ప్రారంభించిన ఆమె తీర్పు గురించి మాట్లాడా రు. ఇది మైనర్ అయితే దారుణ నేరానికి పాల్పడినప్పటికీ తప్పించుకోవచ్చనే తప్పుడు సంకేతాన్నిస్తుందన్నారు. కాగా, మూడేళ్ల శిక్షను తేలికపాటి సామాన్యమైన శిక్షగా బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో అభివర్ణించారు.