
ఢిల్లీలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు శానిటేషన్ ముమ్మరం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పట్ల ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు డీటీసీ బస్సులు, క్లస్టర్ బస్సులు,మెట్రో రైల్, ఆస్పత్రుల్లో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. ఢిల్లీలో ఇప్పటివరకూ మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, ఒక కేసు పరిశీలనలో ఉందని చెప్పారు. కరోనా వైరస్ రోగుల కోసం 25 ఆస్పత్రుల్లో 168 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేశామని తెలిపారు. గత రెండు వారాల్లో విదేశాల నుంచి మీ చుట్టుపక్కల ఎవరైనా నగరానికి వచ్చినట్టు గమనిస్తే ప్రభుత్వానికి తెలపాలని నగరవాసులను కోరారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. విమానాశ్రయంలో ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. వైరస్‌కు లోనవకుండా ఉండేందుకు ప్రజలు తరచూ సబ్బు నీటితో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.