
అత్యంత ప్రమాదకరమైన హైవే ఏదో తెలుసా?
దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారిగా ఢిల్లీ-జైపూర్ హైవే నిలిచింది.
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారిగా ఢిల్లీ-జైపూర్ హైవే నిలిచింది. ఈ రహదారిలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ఏఐ) వెల్లడించింది. 2010 నుంచి 2015 మధ్యకాలంలో ఈ మార్గంలో ఏడాదికి సగటున 191 మరణాలు సంభవించాయని తెలిపింది. ఢిల్లీకి చెందిన వేదపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది.
230 కిలోమీటర్ల ఈ 8వ నంబరు జాతీయ రహదారిపై 2010-15 మధ్యకాలంలో ఏడాదికి సగటున 3వేలకు పైగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 1,637 దుర్ఘటనలు సంభవించాయంటే ఈ రహదారిలో ప్రయాణం ఎంత ప్రమాదమో అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి, ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేదపాల్ కోరుతున్నారు.