ఢిల్లీకి పొరుగున ఉన్న మీరట్, పానిపట్, అల్వార్ నగరవాసులకు శుభవార్త. హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు ఉద్దేశించిన యాంబిషియస్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ (ఆర్‌ఆర్‌టీఎస్) ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించింది. అంతా సవ్యంగా సాగితే ఈ మూడు నగరాలకు ఢిల్లీ నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు.
న్యూఢిల్లీ: హైస్పీడ్ రైళ్లతో రాజధానిని పొరుగున్న నగరాలకు అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన యాంబిషియస్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ (ఆర్‌ఆర్‌టీఎస్) ప్రాజెక్టుకు ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద మీరట్, పానిపట్, ఆల్వార్-ఢిల్లీ మధ్య హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. దీనిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అనుబంధ నేషనల్ కేపిటల్ రీజనల్ ప్లానింగ్ బోర్డు (ఎన్‌సీఆర్‌పీబీ) ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కింద తొలి కారిడార్‌ను ఢిల్లీ-సోనిపట్-పానిపట్ మధ్య నిర్మించనున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 111 కిలోమీటర్లు. 2016 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో ప్రతిరోజూ 3.77 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. ఇక రెండో కారిడార్‌ను ఢిల్లీ-గుర్గావ్-అల్వార్ మధ్య నిర్మించనున్నారు.
దీని పొడవు 180 కిలోమీటర్లు. ఈ మార్గంలో ప్రతిరోజూ ఏడు లక్షల మంది ప్రయాణించొచ్చని అంచనా వేశారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య మూడో కారి డార్ నిర్మితమవనుంది. ఈ మార్గం పొడవు 90 కిలోమీటర్లు. ఈ మార్గంలో ప్రతిరోజూ 5.7 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) సహకరించనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లను అనుసంధానం చేసేందుకు ఉద్దేశించింది. అయితే ఈ ప్రతిపాదనను గతంలో షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిని నగరంలో వరకూ కాకుండా నగర శివార్లకే పరిమితం చేయాలని షీలా ప్రభుత్వం సూచించింది. అయితే అంతలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఈ ప్రాజెక్టు వాయిదాపడింది.
గంటల్లోనే గమ్యానికి
Published Thu, Jun 12 2014 9:56 PM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement
Advertisement