మెట్రోకు అదనంగా 916 కొత్త కోచ్లు
న్యూ ఢిల్లీ: మెట్రో వినియోగదారుల కష్టాలను తీర్చడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్(డీఎంఆర్సీ) నడుంబిగించింది. గత ఐదేళ్లలో మెట్రో వినియోగదారుల వార్షిక వృద్ధి 17.5 శాతంగా నమోదైంది. దీంతో 916 కోచ్లను అదనంగా పట్టాలెక్కించే పనిలో డీఎంఆర్సీ పడింది. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరడగంతో రద్దీకి అనుగుణంగా మెట్రోను విస్తరించడానికి రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల సహకారాన్ని కోరింది.
ఢిల్లీలో ప్రజా రవాణా అవసరాలను తీర్చడానికి అనుగుణంగా మెట్రో రైల్వే ఫ్రీక్వెన్సీ పెంచాలని సుప్రీం కోర్టుతో పాటూ అన్ని వర్గాల నుంచి చాలా రోజులుగా డిమాండ్ ఉంది. ఢిల్లీ మెట్రో తన పరిధిలో 1396 కోచ్లతో పని చేస్తోంది. మరో 916 కోచ్లు అంటే దాదాపు 65 శాతం అధికంగా కోచ్ల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసింది. దీని ప్రకారం మెట్రో ట్రైన్ల సంఖ్య విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న 227 రైళ్లకు అదనంగా102 కొత్త రైళ్లు వినియోగంలోకి రానున్నాయి. కేంద్ర, ఢిల్లీ సర్కారు ఆమోదం లభిస్తే మెట్రో విస్తరణ పనులు 2017 ఏప్రిల్లో ప్రారంభించి 2021 మార్చిలోగా పూర్తి చేస్తామని డీఎంఆర్సీ ఆధికారులు తెలిపారు. ఈ ఏడాది లెక్కల ప్రకారం మెట్రో విస్తరణ పనులకు రూ. 13284 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 6 కారిడార్ల ద్వారా ఢిల్లీ మెట్రోను ఆపరేట్ చేస్తున్నారు. ఫేస్ 3లో భాగంగా మరో రెండు కారిడార్లను పెంచనున్నారు.