సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా 101 రోజులుకు పైగా సాగుతున్న ఆందోళనకు తెరపడింది. కోవిడ్ -19(కరోనా వైరస్) వ్యాప్తి, ఆందోళన, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్, తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితుల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో షాహీన్ బాగ్ ఏరియాలో ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను బలవంతంగా పోలీసులు తొలగించారు. పోలీసు అధికారుల బృందం మంగళవారం ఉదయం నిరసన స్థలానికి చేరుకుని నిరసనకారులను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరారు. టెంట్లు, ఇతర సామగ్రిని నిరసన స్థలం నుండి తొలగిస్తున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని ఆగ్నేయ ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఆర్‌పి మీనా చెప్పారు. మార్చి 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని, నిరసనకారులు ఒకరికొకరు మూడు మీటర్ల దూరంలో కూర్చోవాలని ఆదేశించారు. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం మైక్రోఫోన్ వాడకూడదని కూడా హెచ్చరించారు.మరోవైపు ఐదుగురు మహిళా నిరసనకారులు మాత్రమే నిరసనలో పాల్గొంటూ తమ ఆందోళన కొనసాగిస్తారని, షిప్టుల వారీగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీఏఏ ఆందోళన నిర్వాహకులు వెల్లడించారు. వృద్ధ మహిళలను లేదా జర్వంతో బాధపడుతున్నవారిని ఆందోళనలో పాల్గొనడానికి అనుమతించమని నిర్వాహకులలో ఒకరైన అబిద్ షేక్ ప్రకటించారు. అలాగే నిరసనకారులను వెంటనే తొలగించాలని కోరుతూ చేసిన పిటిషన్ విచారణను కరోనా వైరస కారణంగా సుప్రీంకోర్టు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో, మంగళవారం (మార్చి 24) షాహీన్ బాగ్ ప్రాంతం నుంచి సీఏఏ నిరసనకారులను పోలీసులు తొలగించారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సెక్షన్ 144 ను విధించడంతో ఒకే స్థలంలో ఐదుగురికి పైగా గుమిగూడడం నిషేధం. దీంతో ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా సీఏఏ వ్యతిరేక నిరసన 2019 డిసెంబర్ 15 న ప్రారంభమై గత 101 రోజులుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున కొనసాగుతున్నఈ ఆందోళనలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిదిమంది మృత్యువాతపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment