షిర్డీలోని సాయి బాబా ఆలయ ప్రాంగణంలో భక్తులకు థర్మల్ పరీక్షలు చేస్తున్న సిబ్బంది
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: భారత్‌లో కరోనా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. డెల్, మైండ్ ట్రీ ఐటీ కంపెనీలకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్టు బుధవారం ఆ కంపెనీలు వెల్లడించాయి. అమెరికా టెక్సాస్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా వైరస్ సోకింది. మైండ్ ట్రీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఆఫీసు పని మీద ఇతర దేశానికి వెళ్లి వచ్చారు. ఈ ఉద్యోగులిద్దరూ భారత్‌కు వచ్చాక వారు కలిసిన సంబంధీకులను నిర్బంధంలో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
అది కరోనా మరణం కాదు: కర్ణాటక మంత్రి
మన దేశంలో కరోనా వైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్న ఒక వృద్ధుడు మరణించారు. ఇటీవల సౌదీ యాత్రకి వెళ్లొచ్చిన 76 ఏళ్ల కర్ణాటక వాసి మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ జ్వరం, దగ్గు, జలుబు ఉండటంతో ఐదోతేదీన కలబురిగి జిల్లా మెడికల్ కాలేజీకి, తర్వాత 9న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వైరస్ లక్షణాలు తగ్గకపోవడంతో అంబులెన్స్‌లో కలబురిగికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. అతనికి కోవిడ్ సోకిందన్న అనుమానంతో గతంలోనే రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం బెంగుళూరు ల్యాబ్‌కి పంపారు. హుస్సేన్‌కి కోవిడ్ సోకి ఉంటుందనే అనుమానాలున్నాయని కలబురిగి జిల్లా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సిద్ధిఖీ వృద్ధాప్యంతోనే తుదిశ్వాస విడిచారని, వైరస్ సోకిందని ఆందోళన చెందవద్దని మంత్రి చెప్పారు. దౌత్య, అధికారిక, ఐరాస, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప మిగిలిన వీసాలన్నీ ఏప్రిల్ 15 వరకూ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment