తాజ్‌మహల్ (పాత చిత్రం)
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను కూల్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఒకప్పుడు అది శివాలయమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు తనకు చెప్పారన్న అజాం ఖాన్.. యోగి ఆ తాజ్‌మహల్‌ను కూల్చి మళ్లీ ఆలయం కట్టాలనుకుంటే తాను అందులో భాగస్వామిని అవుతానని వెల్లడించారు. యోగి తాజ్‌మహల్‌ను కూల్చుతానంటే.. తనతో పాటు మరో 10 నుంచి 20వేల మంది ముస్లింలను పలుగు, పారలతో తీసుకొస్తానని ఎస్పీ నేత తన ట్వీట్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి తాజ్ మహల్ కూల్చివేతలో పాలు పంచుకుంటాం. అయితే తాజ్‌మహల్‌పై తొలిదెబ్బ యోగి వేస్తే.. రెండోదెబ్బ కచ్చితంగా నాది అవుతుంది. ప్రపంచ వింత తాజ్‌మహల్ బానిసత్వానికి సంకేతమంటూ’యోగి ఆదిత్యనాథ్‌ను కవ్వించే యత్నం చేశారు అజాం ఖాన్. గతంలో పలువురు బీజేపీ నేతలు అయోద్యలో రామాలయం నిర్మిస్తామని, అదే విధంగా తాజ్‌మహల్‌ను కూల్చేసి గతంలో ఉన్న శివాలయాన్ని అదే స్థానంలో కట్టిస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ ఏడాది మార్చిలో హిందూ మహాసభ విడుదల చేసిన క్యాలెండర్‌లో తాజ్‌మహల్‌ను ‘తేజో మహాలయం శివ మందిరం’అని, కుతుబ్ మినార్‌ను ‘విష్ణు స్తంభం’అని, కాశీలోని జ్ఞాన్‌వ్యాపి మసీదును ‘విశ్వనాథ ఆలయం’అని ప్రచురించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మరిన్ని ముస్లింల కట్టడాలు, నిర్మాణాలను హిందువుల ఆలయాలుగా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అజాంఖాన్ తాజాగా తాజ్‌మహల్‌పై ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment