ద్రోహులను సమర్ధించడం కూడా రాజద్రోహమే
న్యూఢిల్లీ: జేఎన్యూ వివాదం అంతకంతకూ ఉధృత రూపం దాలుస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దేశ ద్రోహం కేసు పెట్టడాన్ని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సమర్ధించారు. దేశద్రోహులను సమర్ధించడంకూడా రాజద్రోహం కిందికి వస్తుందని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి వత్తాసు పలకడం, వారితో స్నేహం చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. అటు రాజ్యంగపరంగాగానీ, ఇటు ఆధ్యాత్మికపరంగా గానీ సమర్ధనీయం కాదంటూ రాందేవ్ బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నేరంగానే పరిగణించాలన్నారు.
ఇప్పటికే ఈ వివాదంలో కన్హయ కుమార్, యూనివర్శిటీ మాజీ అధ్యాపకుడు గిలానీలపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. అదే క్రమంలో జేఎన్యూ విద్యార్ధులకు మద్దతు పలికిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా రాజద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసుపై విచారించేందుకు అలహాబాద్ కోర్టు అంగీకరించింది. భారతీయ శిక్షా స్మృతి (200 సెక్షన్) ప్రకారం రాహుల్‌పై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సుశీల్ కుమార్ ఆదేశించడంతో మరింత అగ్గి రాజుకుంది. ఇదిఇలా ఉంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి దేశరాజధాని నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యాహ్నం రాహుల్ గాంధీ నేతృత్వంలో పలువురు సీనియర్ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు.