
అయోధ్య: కార్తీక పూర్ణిమ సందర్భంగా అయోధ్యలోని సరయూ నదీ తీరం భక్తులతో కిటకిటలాడింది. దాదాపు అయిదు లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం అయోధ్యకు పోటెత్తారు. పవిత్ర స్నానాలను సోమవారం సాయంత్రం 5:34 నుంచి మంగళవారం ఉదయం 6:42 వరకు ఆచరించారు.
ఇటీవలే రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అయోధ్యలో భారీగా బలగాలు మోహరించి ఉన్నాయి. అయినప్పటికీ భారీగా భక్తులు తరలివచ్చారు. సీతారాం అనే ఉచ్ఛారణల మధ్య భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.