ముంబై: డయాబెటిస్.. స్థూలకాయం.. మెట్రో నగరాల్లో ఇప్పుడు యువతపై పంజా విసురుతున్న వ్యాధులివీ! ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌లో మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వే ఈ విషయాన్ని తేల్చింది. నవ ఉత్తేజంతో ఉరకలెత్తాల్సిన యువత జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నట్లు ఇందులో తేలింది. జూన్ 9-15 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 38,966 మంది ఆరోగ్య పరిస్థితిని గమనించగా.. అందులో ఏకంగా సగానికిపైగా (56.81 శాతం) మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ 38,966 మందిలో 20-40 ఏళ్ల వయసున్నవారు 41.48 శాతం ఉండ డం గమనార్హం.
ఇక మరో శాంపిల్‌లో 35,886 మందిని పరిశీలించగా.. వారిలో దాదాపు 9 శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. వారంతా 20-40 ఏళ్ల వయసున్నవారే! శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి వల్లే యువతను ఈ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మరికొందరు వంశపారంపర్యంగా వీటి బారిన పడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మెట్రో యువత పై డయాబెటిస్ పంజా!
Published Tue, Jun 17 2014 12:31 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement
Advertisement