న్యూఢిల్లీ: మత్తు మందులకు బానిసైన ఓ యువకుడు, వికలాంగుడైన స్నేహితుడిని హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కేవలం 300 రూపాయల కోసం ప్రతిభావంతుడైన విద్యార్థి వినోద్ కుమార్ (31) హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఢిల్లీలోని సీలం పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది.
మూగ, చెవిటి అయిన వినోద్ కుమార్ చదువులో మంచి ప్రతిభావంతుడు. దీనికిగాను రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నాడు. చదువులో రాణించడంతో పాటుగా కిరాణా కొట్టు నడుపుకునే తల్లికి వినోద్ నిరంతరం చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడు సల్మాన్ గత నెలలో 300 వందలు విలువచేసే సరుకులు తీసుకెళ్లాడు. ఆ అప్పు చెల్లించకుండానే మళ్లీ సరుకుల కోసం రావడంతో ముందు తీసుకున్న బాకీ డబ్బులు చెల్లించాలని సల్మాన్ ని వినోద్ నిలదీశాడు. దీంతో ఆగ్రహం చెందిన సల్మాన్ చంపేస్తానంటూ బెదిరించాడు.
ఈ క్రమలో వరుసకు సోదరుడు కమల్ తో కలిసి వినోద్ మార్కెట్ కు వెళ్లి వస్తుండగా సల్మాన్ వారిని అటకాయించాడు. ఇద్దరిపైనా దాడికి దిగాడు. ముగ్గురి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో వినోద్ కుమార్ పై సల్మాన్ కాల్పులు జరిపి పరారయ్యాడు. నుదుటిపై తీవ్ర గాయం కావడంతో వినోద్ అక్కడిక్కడే రక్తపు మడుగులో కుప్ప కూలిపోయాడు.
అక్కడే ఉన్న కమల్ సోదరుడిని ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే వినోద్ ప్రాణాలు విడిచాడు. సల్మాన్ పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. సల్మాన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడనే తమ ప్రాథమిక విచారణలో తేలిందని, అతని సెల్ఫోన్ డాటా ఆధారంగా విచారణ సాగిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.