Differently-abled
-
దివ్యాంగులకు గుడ్న్యూస్.. మీ ఇంటికే వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే వ్యాక్సినే శరణ్యం కావడంతో మరింత మందికి టీకా డోసులు అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగులకు, ఇంటి నుంచి కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దకే వచ్చి టీకాలు ఇస్తామని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ చెప్పారు. ఇళ్ల వద్ద వ్యాక్సిన్ వేయడానికి కావల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఇంకా రెండో వేవ్ మధ్యలోనే ఉన్నామని∙ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కేరళ నుంచే అత్యధికంగా కేసులు వస్తున్నాయని గత వారం 62.73% కేసులు ఆ రాష్ట్రం నుంచే వచ్చాయని చెప్పారు. లక్షకు పైగా యాక్టివ్ కోవిడ్ కేసులున్న ఏకైక రాష్ట్రం కేరళయేనని వెల్లడించారు. చదవండి: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అర్హుల్లో 66 శాతం మందికి కరోనా టీకా దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 66 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక్క డోసైనా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం చెప్పారు. 23 శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 63.7 శాతం డోసులను గ్రామీణ ప్రాంతాల్లో, 35.4 శాతం డోసులను పట్టణ ప్రాంతాల్లో ఇచ్చినట్లు తెలిపారు. 68.2 లక్షల డోసులను (దాదాపు 0.95 శాతం) కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇచ్చామని, వీటిని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కేటగిరీలో కలుపలేమని వివరించారు. దేశంలో పండుగల సీజన్ మొదలయ్యిందని, కరోనా నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని రాజేశ్ భూషణ్ సూచించారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
చేతులు లేకుంటేనేం..
చేతులు లేకుంటేనేం.. ఆత్మస్థైర్యం, ఏదో సాధించాలనే కసి ఆమెను ముందుకు నడిపించాయి. లా డిగ్రీ అర్హతతో ఉద్యోగం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమెకు నిరాశే ఎదురైంది. దానికి ఆమె నిరుత్సాహపడలేదు. ఉద్యోగం అని తిరిగితే పనికాదు.. ఇక ఏదో ప్రత్యేకమైన కెరీర్ను ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. మోటివేషనల్ స్పీచ్లు ఇవ్వడం, రాయడం మొదలు పెట్టింది. కొన్నాళ్లకు ఆ పని కూడా బోర్ కొట్టింది. ఫ్యాషన్ డిజైన్ రంగంవైపుకు అడుగేసింది. అది నచ్చింది. అంతే ఇక ఆమెకు తిరుగులేదు. ఆ రంగంలో తనదైన ముద్రవేసింది. ప్రస్తుతం మెక్సికోలోని గ్వాడలజరాలో విజయవంతమైన ఫ్యాషన్ డిజైనర్గా దూసుకెళ్తుంది. ఆమె పేరు అడ్రియానా మాకియస్. పుట్టకతోనే రెండు చేతులు లేవు. అయినా అడ్రియానా ఎప్పుడు బాధపడలేదు. గత నెల మెక్సికోలో జరిగిన ఫ్యాషన్ వీక్లో అడ్రియానా డిజైన్ చేసిన దుస్తులను దివ్యాంగ మోడల్స్ ప్రదర్శించారు. వాటికి ఆదరణ లభించి అడ్రియానాకు మంచి గుర్తింపు లభించింది. ధరించే దుస్తులు వ్యక్తులను డామినేట్ చేయవద్దని, దుస్తులను ధరించే వ్యక్తులు డామినేట్ చేయాలంటుంది అడ్రియానా. అందుకే తాను సౌకర్యవంతమైన, ఫార్మల్ దుస్తులను మాత్రమే డిజైన్ చేస్తానని చెప్పుకొచ్చింది. 41 ఏళ్ల వయసున్న అడ్రియానకు చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రలు కాళ్లతో పనిచేయడం నేర్పించారు. ఇప్పుడు ఆమె ఎవరి సహాయం లేకుండా తన కాళ్లతో తినగలదు.. రాయగలదు.. వంట కూడ చేయగలదు. చివరకు తన డిజైన్స్ దుస్తులు కూడా కుట్టగలదు. 20 ఏళ్ల వయసు వరకు కృత్రిమ చేతులు ఉపయోగించిన అడ్రియాన.. వాటి బరువు వల్ల భుజాల్లో కలిగిన నొప్పితో తీసేసింది. కృత్రిమ చేతులు లేకుండా యూనివర్సిటీకి వెళ్లడం చాలా కష్టంగా ఉండేదని, క్లాస్లో షూస్ తీసి రాయడం మరింత కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చింది. ఇక అడ్రియానా జీనియస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఒక నిమిషంలో కాళ్లతో ఎక్కువ బర్త్డే క్యాండిల్స్ వెలిగించిన వ్యక్తిగా గుర్తింపు పొందింది. -
మూడువందల కోసం చంపేశాడు
న్యూఢిల్లీ: మత్తు మందులకు బానిసైన ఓ యువకుడు, వికలాంగుడైన స్నేహితుడిని హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కేవలం 300 రూపాయల కోసం ప్రతిభావంతుడైన విద్యార్థి వినోద్ కుమార్ (31) హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఢిల్లీలోని సీలం పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. మూగ, చెవిటి అయిన వినోద్ కుమార్ చదువులో మంచి ప్రతిభావంతుడు. దీనికిగాను రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నాడు. చదువులో రాణించడంతో పాటుగా కిరాణా కొట్టు నడుపుకునే తల్లికి వినోద్ నిరంతరం చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడు సల్మాన్ గత నెలలో 300 వందలు విలువచేసే సరుకులు తీసుకెళ్లాడు. ఆ అప్పు చెల్లించకుండానే మళ్లీ సరుకుల కోసం రావడంతో ముందు తీసుకున్న బాకీ డబ్బులు చెల్లించాలని సల్మాన్ ని వినోద్ నిలదీశాడు. దీంతో ఆగ్రహం చెందిన సల్మాన్ చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమలో వరుసకు సోదరుడు కమల్ తో కలిసి వినోద్ మార్కెట్ కు వెళ్లి వస్తుండగా సల్మాన్ వారిని అటకాయించాడు. ఇద్దరిపైనా దాడికి దిగాడు. ముగ్గురి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో వినోద్ కుమార్ పై సల్మాన్ కాల్పులు జరిపి పరారయ్యాడు. నుదుటిపై తీవ్ర గాయం కావడంతో వినోద్ అక్కడిక్కడే రక్తపు మడుగులో కుప్ప కూలిపోయాడు. అక్కడే ఉన్న కమల్ సోదరుడిని ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే వినోద్ ప్రాణాలు విడిచాడు. సల్మాన్ పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. సల్మాన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడనే తమ ప్రాథమిక విచారణలో తేలిందని, అతని సెల్ఫోన్ డాటా ఆధారంగా విచారణ సాగిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.