కఠినమే అయినా కరెక్ట్: జైట్లీ
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమర్థించారు. చార్జీల హెచ్చింపు నిర్ణయం కఠినమైనదైనా, అది సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. కఠినమే అయినా, చార్జీల హెచ్చింపుపై రైల్వే మంత్రి సరైన నిర్ణయమే తీసుకున్నారని జైట్లీ అన్నారు. కొన్నేళ్లుగా నష్టాల్లో నడుస్తున్న రైల్వేలు కోలుకునేందుకు చార్జీల పెంపు తప్ప గత్యంతరం లేదన్నారు. రైల్వే చార్జీల పెంపు వెనుక అసలు నిజం పేరుతో సోషల్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో జైట్లీ ఒక వివరణను పొందుపరిచారు. రైల్వే బోర్డు గత ఫిబ్రవరి 5న యూపీఏ హయాంలోనే చార్జీల పెంపుపై ప్రతిపాదన చేసిందని జైట్లీ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. కాగా, రైల్వే చార్జీల పెంపును సమర్థిస్తూ అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. జైట్లీ వ్యాఖ్యలు అహంకారంతో కూడుకున్నవని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. అది ఒత్తిళ్లమధ్య తీసుకున్న నిర్ణయం..కల్‌రాజ్
తీవ్రమైన ఒత్తిళ్లమధ్య తప్పనిసరి పరిస్థితుల్లోనే, రైలు చార్జీలపెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా అన్నారు. అయితే, చార్జీల హెచ్చింపువల్ల తలెత్తే ద్రవ్యోల్బణం సమస్యకు ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం చూస్తుందని చెప్పారు.
ప్రగతికోసం కఠిన నిర్ణయాలు..వెంకయ్య
ైరైల్వే చార్జీల పెంపును మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా సమర్థించారు. ప్రస్తుతం రెల్వేల పరిస్థితి అంత బాగాలేదని, నిధులు, వనరుల కొరత నెలకొందని ఆయన చెన్నైలో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ప్రతిపాదించిన రైలుమార్గాలు నిర్మించాలంటే కనీసం 40ఏళ్లు పడుతుందన్నారు. అయితే దేశం ప్రగతికోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు.