
దూకుడుగా దినకరన్
సీఎం పళని, విప్ రాజేంద్రన్‌పై వేటు
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే నాయకురాలు శశికళను పార్టీ నుంచి సాగనంపేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రయత్నాలు వేగవంతం చేసిన నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ మరో అడుగు ముందుకు వేశారు. సేలం రూరల్ జిల్లా పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం పళనిని తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు.
అలాగే తన వర్గం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన విప్ రాజేంద్రన్‌ను కూడా ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రకటన జారీచేశారు. దీంతో దినకరన్ తీరును నిరసిస్తూ పలుచోట్ల సీఎం మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. మరోవైపు తనకు ఎవరెవరు మద్దతుగా ఉన్నారో తెలుసుకునేందుకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సోమవారం ప్రత్యేక సమావేశానికి సీఎం పళని పిలుపునిచ్చారు.