వారిని తీవ్రంగా అవమానించారు: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి | Disha Incident Telangana Congress MPs Agitation At Parliament | Sakshi
Sakshi News home page

దిశ కేసు: పార్లమెంటు వద్ద కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

Published Mon, Dec 2 2019 4:18 PM | Last Updated on Mon, Dec 2 2019 5:03 PM

Disha Incident Telangana Congress MPs Agitation At Parliament - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ దిశ అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారిని 30 రోజుల్లోగా బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. హత్య జరిగి నాలుగు రోజులైనా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పటికీ బాధితురాలి కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. దాంతో నేరాలు పెరుగుతున్నాయి. జాతీయ రహదారిలో సైతం టీఆర్ఎస్ నేతలు బార్లు పెట్టారు అని ఆరోపించారు. మరోవైపు... ప్రధాని నరేంద్ర మోదీ చట్టాలను సవరించాలంటూ తప్పించుకోవాలని చూస్తున్నారని ఎంపీలు విమర్శించారు. ఏ సమయంలోనైనా స్త్రీలు బయట తిరగలిగేలా రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఇక లోక్‌సభలో దిశ ఘటనపై చర్చ సందర్భంగా రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ’దిశ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం. రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయి. హజీపూర్‌లో వరుస హత్యలు జరిగాయి. తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తికి స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే హైకోర్టు దానిని మారుస్తూ జీవిత ఖైదు చేసింది. బాధితులకు న్యాయం జరిగాలంటూ ఇటువంటి ఘటనల్లో నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చట్టాలు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

వారిని అవమానించారు: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
దిశ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు సరిగా స్పందించలేదు. మా పరిధిలోకి రాదంటూ వారిని అటూ ఇటూ తిప్పారు. అవమానించారు. బాధితురాలు ఎవరితోనో వెళ్లిపోయిందంటూ నీచంగా మాట్లాడారు. రెండు మూడు పోలీసు స్టేషన్లకు వారిని తిప్పారు. ఒకవేళ వెంటనే పోలీసులు స్పందించి ఉంటే బాధితురాలి ప్రాణం నిలిచేది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. అందుకే జాతీయ రహదారుల వెంట మద్యం అమ్ముతున్నారు. ఈ ఘటనలో నిందితులు ఫుల్లుగా తాగి ఉన్నారు. మద్యం వల్లే నేరాలు పెరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఙ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement