ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు ( ఫైల్)
ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది.. నలుగురు కామాంధులు చేసిన వికృత చేష్టలకు సమాజం దిగ్బ్రాంతికి గురైంది. దిశ ఉదంతం.. పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్ శివారులో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికీ మూడేళ్లు పూర్తయింది. ఆమె మరణం.. మహిళా రక్షణ కొత్త చట్టాలకు దిశా నిర్దేశం చేసింది. మహిళల దశ మార్చే న్యాయసహాయకులకు, నిఖార్సైననిర్ణయాలకు రూపకల్పన చేసింది. అమానుషమైన నాటి ఘటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఓ సారి గుర్తు చేసుకుంటే..
– షాద్‌నగర్
2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయం.. దిశ అనే యువతి అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపింది. అక్కడి నుంచి పని మీద వెళ్లింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. అంతలోనే నలుగురు కామాంధులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు.
నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని నిందితులు లారీలో తీసుకొచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. అయితే 2019 డిసెంబర్ 6 తెల్లవారుజామున సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్ధలానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి వారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేయడం మరో సంచలనం అయ్యింది. దిశ హత్య ఘటన జనాలను ఎంతగా కదిలించిందంటే ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్తిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు.
అంతేకాదు దిశ హత్య ఉదంతం కొత్త చట్టాలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేసి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది.
మారిన చట్టాలు
దుర్మార్గుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన దిశ పేరిట కొత్త చట్టాలను ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్ధలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లను, పోలీసు వ్యవస్థను, ఏర్పాటు చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలపై కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ల ప్రభావం కారణంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు.
అప్రమత్తత అవసరం
సమాజంలో ఇంకా అక్కడక్కడా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న, కల్పిస్తున్న సదుపాయాలను యువతులు, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment