సాక్షి, హైదరాబాద్ : చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం.. దిశ తల్లిదండ్రులను పిలిపించింది. దిశ తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను ఎన్‌హెచ్‌ఆర్‌సీ రికార్డు చేయనుంది. ఈ నేపథ్యంలో దిశ తల్లిదండ్రులు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. బాధిత కుటుంబం తరఫున వాస్తవాలు చెప్పడానికి ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల దగ్గరకు వెళతామని దిశ తల్లిదండ్రులు ఇప్పటికే తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) విచారణ రెండోరోజు కూడా కొనసాగుతోంది. నిన్న ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కమిషన్ ప్రతినిధులు మహబూబ్‌నగర్ నుంచి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితుల మృతదేహాలను పరిశీలించడంతో పాటు, వాళ్ల కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. దిశ తల్లి ఆరోగ్యం సహకరించడం లేదని, ఎన్‌హెచ్‌ఆర్సీ తమను ఇబ్బంది పెట్టకూడదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో శంషాబాద్ పోలీసులు ...దిశ నివాసానికి చేరుకొని.. వారిని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి తీసుకువెళ్లారు. అయితే, దిశ దినకర్మ రోజున విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్ ఘటనలో గాయపడి, కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ వద్ద కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ ఇప్పటికే స్టేట్‌మెంట్ నమోదు చేసింది. ఎన్‌కౌంటర్ నిజానిజాలను నిర్ధారించేందుకు వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు తమ విచారణను రహస్యంగా నిర్వహించారు. ఎన్‌కౌంటర్, పోస్టుమార్టంపై తమ అనుమానాలను నివృత్తి చేసుకునే క్రమంలో వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియాతో మాట్లాడతారని భావించినా మాట్లాడలేదు. మూడు రోజుల విచారణ పూర్తయిన తర్వాతే వారు మీడియాతో మాట్లాడతారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment