ఎన్‌కౌంటర్ వివరాలను టీవీలో వీక్షిస్తున్న దిశ కుటుంబసభ్యులు
సాక్షి, శంషాబాద్ : దిశపై దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారన్న వార్త ఆమె కుటుంబంలో సంతోషాన్ని నింపింది. దిశ తిరిగి రాదన్న బాధలో ఉన్న తమకు ఇప్పుడు కొంత ఉపశమనం కలిగిందని ఆమె కుటుంబ సభ్యులన్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణ సంఘటనలు జరగకుండా ఇదో ఉదాహరణలా మారాలన్నారు. మీడియాతో దిశ తల్లిదండ్రులతో పాటు సోదరి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
తగిన శిక్ష పడింది..
మాకు మనశ్శాంతి కలిగింది.. మా బిడ్డ తిరిగి రాదు.. మేము అనుభవిస్తున్న బాధ మళ్లీ ఎవరికీ రాకూడదు. నాకు వాళ్లను (హంతకులను) చూడాలనిపిస్తోంది.. మా అమ్మాయి ఏం తప్పు చేసింది.. ఎంత నరకం అనుభవించిందో.. ఎప్పుడూ అంద రి మంచిని మాత్రమే ఆలోచించేంది. మీ సోదరిలాంటి దానిని అని చెప్పినా వినకుండా దారుణానికి ఒడిగట్టారు.. వారికి తగిన శిక్ష పడింది.
–విజయమ్మ, దిశ తల్లి
పోలీసులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఎన్‌కౌంటర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.. ప్రజలంతా మాకు అండగా నిలబడ్డారు. మా బిడ్డ అయితే తిరిగి రాదు.. ఇది కొంతవరకు ఉపశమనం మాత్రమే.. కేసు కోర్టుకు వెళ్తుందని, న్యాయం జరగడానికి ఎంత కాలం పడుతుందోనని అనుకున్నా. ఇంత త్వరగా వారికి శిక్ష పడుతుందని అనుకోలేదు. ప్రతి ఒక్కరూ దిశకు జరిగిన అన్యాయాన్ని వారి బిడ్డకు జరిగిన ఘోరంగానే భావించారు. దేశ విదేశాల నుంచి ఫోన్లు చేసి పరామర్శించారు. వారికి సరైన శిక్ష పడిందనే అనుకుంటా.. పోలీసులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సమాజంలో జరుగుతున్న దారుణాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది..
–శ్రీధర్‌రెడ్డి, దిశ తండ్రి
దీనిని ఉదాహరణగా తీసుకోవాలి
ఈ ఘటనను ఉదాహరణగా తీసుకోవాలి.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవని అనుకుంటున్నా.. పోలీసులు నిందితులను 24 గంటల్లో పట్టుకున్నారు. వారికి ఉరిశిక్ష పడుతుందని భావించాను. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా వారిని ఎన్‌కౌంటర్ చేశారని టీవీలో చూశాను. ఎన్‌కౌంటర్ వార్త నాకు సంతోషంగానే ఉంది. పోలీసులకు, ప్రభుత్వానికి, మీడియాకు కృతజ్ఞతలు.. సంఘటన జరిగిన రోజు నుంచి అందరూ మాకు అండగా ఉన్నారు.
–భవ్య, దిశ సోదరి
Comments
Please login to add a commentAdd a comment