
న్యూఢిల్లీ : ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను మార్చాల్సిన అవసరం గురించి చర్చ జరగాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అత్యాచార ఘటనల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాలు రూపొందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య కేసును పార్లమెంటు ఉభయ సభలు తీవ్రంగా ఖండించాయి. ఈ క్రమంలో లోక్‌సభలో చర్చ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... పాతకాలం నాటి చట్టాలను సవరించేలా ముసాయిదా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
’ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఇంకాస్త మెరుగ్గా వ్యవహారించాల్సింది ఉంది. నిర్భయ ఘటనలో కనీసం శవమైనా తల్లిదండ్రులు చూసుకున్నారు. కానీ దిశ ఘటనలో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు ఎదురైనపుడు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా 112 సమీకృత నంబరు ఇచ్చాం. ఢిల్లీలో నేనే ఆ నంబరును ప్రారంభించాను. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ నంబరుకు ఫోన్ చేయాలి. స్థానిక పోలీసులతో పాటు మన వాళ్లకు (ఒకేసారి 10 మంది) సమాచారం వెళ్తుంది. ఉగ్రవాదం, అవినీతిని అరికట్టడంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోదీ సర్కారు మహిళల రక్షణ విషయంలోనూ నిబద్ధతతో ఉంది అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
సిగ్గుతో తలదించుకోవాలి: బండి సంజయ్
హైదరాబాద్‌లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఈ దారుణ ఘటన జరిగింది. ఇందుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. అనేక సంస్కరణలు తీసుకువస్తున్నాం. అయితే వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. నేరాలకు పాల్పడిన తర్వాత శిక్ష పడేందుకు జరుగుతున్న జాప్యం కారణంగా దోషులు తప్పించుకునే అవకాశం లభిస్తోంది. కాబట్టి వెంటనే శిక్షలు అమల్యేయేలా కఠిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment