కరుణానిధి వెల్లడి
తీర్పును మనం సవాలు చేయాల్సిన అవసరం లేదని
కర్ణాటకకు లీగల్ సెల్ సూచన
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని డీఎంకే నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు పార్టీ జిల్లా కార్యదర్శుల బేటీలో కరుణ ఈ అంశంపై చర్చించారు. ‘ఈ కేసులో జోక్యం చేసుకునే హక్కు డీఎంకేకు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే రెండుసార్లు చెప్పింది.
తప్పకుండా సుప్రీంకోర్టుకు వెళ్తాం’ అని ప్రకటనలో కరుణ పేర్కొన్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై డీఎంకే ఒత్తిడి తెస్తోంది. అప్పీలుకు వెళ్లాల్సిందిగా ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, కర్ణాటక అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్ కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేయడాన్ని కరుణ ప్రస్తావించారు. కాగా, కేసులో అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కర్ణాటక పీసీసీ లీగల్, మానవ హక్కుల విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో కర్టాటక పాత్ర ‘పరిపాలన’ వరకే పరిమితమని ఆ విభాగం చైర్మన్ ధనుంజయ పేర్కొన్నారు. సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలోనూ ఈ అంశంపై చర్చించలేదు.
జయ కేసులో అప్పీలుకు వెళ్తాం
Published Tue, May 26 2015 1:57 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM
Advertisement