ప్రతీకాత్మక చిత్రం
లక్నో : బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోవద్దంటూ ఇస్లామిక్ మత సంస్థ దారుల్ ఉలూమ్ ధియోబంద్ ఫత్వాను జారీ చేసింది. బ్యాంకుల్లో పని చేస్తున్న చాలా మంది అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్నారని పేర్కొంది. అక్రమ ధనార్జన చేస్తూ ఉన్నత కుటుంబాలకు చెందిన(వరుడు లేదా వధువు) వారిని వివాహం చేసుకోవాలనుకోవడం కన్నా దారుణం మరొకటి లేదని చెప్పింది.
వివాహ సంబంధాలు వెతుకుతున్న ఓ యువకుడికి ఓ మ్యాచ్ వచ్చిందని పేర్కొన్న దారుల్ సంస్థ.. యువతి తండ్రి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారని చెప్పింది. ఉద్యోగం ద్వారా అక్రమంగా అర్జించిన మొత్తాన్ని వారు వరుడికి ఇస్తానని ఆఫర్ చేశారని వెల్లడించింది. అలాంటి కుటుంబంలోని అమ్మాయిని తాను చేసుకోవచ్చా? అని సదరు యువకుడు సంస్థను ఆశ్రయించినట్లు తెలిపింది.
ఆ కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకోవద్దని యువకుడికి చెప్పినట్లు వెల్లడించింది. అక్రమ ధనార్జనతో ఎదిగిన వ్యక్తికి మంచి లక్షణాలు ఉండవని, మోరల్స్‌ను పాటించరని పేర్కొంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవాలని సూచింనట్లు వివరించింది.
ఈ నిబంధనలు ఎక్కడివి?
- ఇస్లామిక్ చట్టం ప్రకారం వడ్డీకి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. దీన్ని ఇస్లామిక్ చట్టంలో ‘రిబా’ అని పిలుస్తారు.
- వ్యాపారంలో పెట్టుబడి పెట్టి సంపాదించిన మొత్తాన్ని కూడా ఇస్లామిక్ చట్టం అక్రమ ధనం(హరామ్)గా భావిస్తుంది.
ఈ రెండు సూత్రాలను ఖురాన్ నుంచి ఇస్లామిక్ చట్టంలోకి తీసుకున్నారు. అప్పటినుంచి వీటిని కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇస్లామిక్ బ్యాంకులు సైతం ‘వడ్డీ లేని బ్యాంకింగ్’ సూత్రం మీద ఆధారపడి పని చేస్తాయి. రుణ దారుల నుంచి బ్యాంకులు తిరిగి తీసుకున్న మొత్తాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టి లాభాలు అర్జిస్తే దాన్ని సరైన ఆదాయం(షరియత్)గానే భావిస్తారు.
ప్రపంచంలోని అన్ని ఇస్లామిక్ దేశాల్లో ఇస్లామిక్ బ్యాంకులు ఉన్నాయి. చైనా, యూకే, అమెరికా, జర్మనీ దేశాల్లో కూడా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment