మోదీకి ట్రంప్ ఫోను
న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్.. మంగళవారం రాత్రి 11.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ కార్యాలయం మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ వెల్లడించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా వివిధ దేశాధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్ ఇప్పటికే కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాధినేతలకు ఫోన్ చేసి మాట్లాడారు.
మంగళవారం రాత్రి ప్రధాని మోదీ ట్రంప్‌కి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సైనిక, ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యం బలోపేతంపై చర్చించారు. వచ్చే ఏడాది మోదీని అమెరికా పర్యటనకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లును అధిగమించడంలో భారత్ ఓ నిజమైన స్నేహితునిగా ట్రంప్ అభివర్ణించారు. భద్రతపరమైన అంశాలతో పాటు పలు కీలక అంశాలపై ఇరు నేతలు చర్చించినట్లు వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపడేలా కృషి చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన వెంటనే అభినందించిన తొలి ఐదుగురు నేతల్లో మోదీ కూడా ఒకరు.