'అలా అయితే మా పార్టీలోకి రావొద్దు'
పణజి: కాంగ్రెస్, బీజేపీ భార్యాభర్తల్లా వ్యవహరిస్తూ ప్రజలతో ఆడుకుంటున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మిస్టర్-మిసెస్ గా కాంగ్రెస్-బీజేపీ వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించారు. పణజిలో ఆమ్ ఆద్మీ పార్టీ వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
'కాంగ్రెస్-బీజేపీ పార్లమెంట్ లోపల మొగుడు-పెళ్లాం మాదిరిగా కొట్టుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలకు ఒకరి రహస్యాలు మరొకరికి తెలుసు. గోవాలో కాంగ్రెస్ నేతల అక్రమాలకు సంబంధించిన ఫైళ్లు రక్షణ మంత్రి (మనోహర్ పరీకర్) వద్ద ఉన్నాయని కొంతమంది నాకు చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా ఆయన ఎటువంటి చర్యలు తీసుకోరు. వారిని బెదిరించేందుకు ఈ పత్రాలు ఆయన వద్దే ఉంచుకున్నార'ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని, ప్రజలను వెర్రివాళ్లను చేసి ఆడుకుంటున్నాయని అన్నారు. కాంగ్రెస్-బీజేపీ ప్రజలను దోచుకుంటున్నాయని మండిపడ్డారు. దేశాన్ని చెరో ఐదేళ్లు పాలించాలని ఈ రెండు పార్టీలు అలిఖిత అవగాహనకు వచ్చాయని ఆరోపించారు.
టిక్కెట్ల కోసం 'ఆప్'లో చేరవద్దని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పార్టీలో పనిచేసే వారికి వివిధ బాధ్యతలు అప్పగిస్తామని, టిక్కెట్ల కేటాయింపు కూడా అలాంటిదేనని చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే స్థానికుడినే ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ ఇంతకుముందే ప్రకటించారు.